Aug 05,2023 21:57

ఎంపిపి, వైస్‌ ఎంపిపితో వాగ్వివాదం చేస్తున్న సర్పంచుల భర్తలు

ప్రజాశక్తి - పాచిపెంట : స్థానిక స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి బి.ప్రమీల అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పార్టీ సభ్యుల మధ్యే ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. తొలుత కేసలి, మోసూరు పంచాయతీల సర్పంచులు ఎస్‌.నిర్మల, జి.చంటి మాట్లాడుతూ మండలంలో ఎంపిటిసి సెగ్మెంట్లకు సంబంధించి గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక్కొక్క సెగ్మెంట్‌కు ఎంత ఎంత నిధులు కేటాయించారు? ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేశారో తెలపాలని ఎంపిపిని ప్రశ్నించారు. బడ్జెట్‌ సమావేశంలో నిధులు కేటాయింపులకు సంబంధించి చర్చించాలని సర్వసభ్య సమావేశంలో కేవలం సమస్యలపైనే ప్రస్తావించాలని, ఇప్పుడు సమయం కాదని ఎంపిపి సమాధానం ఇచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన సర్పంచులు, మరి కొంతమంది ఎంపిటిసి సభ్యులు ఇప్పుడే తెలపాలని పట్టుపట్టడంతో వైస్‌ ఎంపిపి కె.రవీంద్ర జోక్యం చేసుకొని బడ్జెట్‌ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఇప్పుడు చర్చించడం ఏమిటని మరోమారు అనడంతో సమావేశ మందిరం బయట ఉన్న. కేసలి, మోసూరు సర్పంచులు భర్తలు ఎస్‌ రాము, జి.రాము సభలోకి దూసుకొచ్చి వైస్‌ ఎంపిపితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. దీంతో వైస్‌ ఎంపిపి మీసాల నారాయణతో పాటు మరికొంత మంది సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు సమావేశం నుంచి బాయికట్‌ చేశారు. గుమ్మడి గూడ, మోదుగ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు తుక్కుబట్టి నేలకొరవడంతో విద్యుత్‌ షాక్‌కు గురై మూగ జీవులు మృత్యువాత పడుతున్నాయని, దీంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారని తక్షణమే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ ఎఇ రమేష్‌ను కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా పాఠశాల భవనాలు లేక ఉన్న భవనాలు పూర్తిగా మరమ్మతులు గురి కావడంతో భయం గుప్పెట్లో గిరిజన పిల్లలకు విద్యా బోధనలు అందుతున్నాయని, కొత్త పాఠశాల భవనాలు నిర్మించాలని ఎంఇఒ పి.జోగారావును ఆయా ప్రాంత గిరిజన ప్రజాప్రతినిధులు కోరారు. అలాగే పలు శాఖలపై చర్చలు జరిగాయి. సమావేశంలో ఎంపిడిఒ జి.పార్వతి, వైస్‌ ఎంపిపి మీసాల నారాయణ, పలువురు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీతానగరం : పలు సమస్యలపై రామవరం, జోగింపేట, పాపంవలస పంచాయతీల సర్పంచులు పి.సత్యనారాయణ, ఎం.గౌరునాయుడు, కె.సింహాచలం అధికారులను ప్రశ్నించారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి బి.రవణమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా, డిఎపి సరిపడా ఉన్నాయన్నారు. సర్పంచ్‌ ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. హరిత రాయబారులకు పంచాయతీ నిధుల నుంచి జీతాలు చెల్లించలేమని సర్పంచులు ఖరాఖండీగా చెప్పారు. ఎంఇఒ జి.సూరి దేవుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు సంఖ్య తగ్గుతున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో పాఠశాలలు పెరుగుతున్నాయన్నారు. దీనిపై సర్పంచు మాట్లాడుతూ స్కూల్‌కు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులు బయటకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన సమాధానం రాలేదు. అన్ని సమస్యలపై సర్పంచులు, అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్వి ప్రసాద్‌, ఇఒపిఆర్‌డి కెకె వర్మ, వివిధ శాఖ అధికారులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

రీ సర్వేలోనూ తప్పులేనా?
సాలూరురూరల్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం ఇంకా తప్పులను చేస్తూనే ఉన్నారని మండల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ అధ్యక్షతన జరిగింది. తొలుత కురుకుట్టి, శివరాంపురం ఎంపిటిసి సభ్యులు సుబ్బారావు, త్రినాథ్‌ నాయుడు, తోణాం, శివరాంపురం, జీగిరాం సర్పంచులు మువ్వల ఆదయ్య, జరజాపు మోహన్‌, జి.సూరప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతు భూమి వివరాలు, కొలతలు సరి చేసేందు ప్రభుత్వం జగనన్న భూ రక్ష కార్యక్రమంలో భాగంగా రీ సర్వేను నిర్వహించిందన్నారు. అయితే రీసర్వే అయినా ఇంకా వాటిలోనూ తప్పులను సరిదిద్దడంలేదని, భూమి లేని వారి పేరున భూమి ఉన్నట్లు, ఎకరా భూమి ఉంటే 40 ఎకరాలు కంప్యూటర్‌లో చూపించడం వల్ల సన్న, చిన్న కారు రైతులకు రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారన్నారు. దీనికి ఆర్‌ఐ జగదీష్‌ సమాధానమిస్తూ రీ సర్వేను సక్రమంగా అమలు చేస్తున్నామని, ఇంకా అక్కడక్కడ పొరపాట్లు ఉంటే పై అధికారులకు తెలియజేసి సరిచేస్తామని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో మండలం మొత్తం సర్టిఫికెట్లు అందజేశామన్నారు. భూమిలేని నిరుపేద గిరిజనులను గుర్తించి డి-పట్టాలు మంజూరు చేయమని కలెక్టర్‌కు పంపామని తెలిపారు. మామిడిపల్లి, బాగువలస, తోణాం వైద్యాధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలకుండా ముందుగానే గ్రామాల్లో ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ జరిపించాలని కోరారు. ఇళ్ల నిర్మాణ పనులు కూడా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు హౌసింగ్‌ ఎఇ తెలిపారు. విద్యుత్‌ శాఖ ఎఇ సింహాచలం మాట్లాడుతుండగా తోణాం సర్పంచ్‌ మువ్వల ఆదియ్య జోక్యం చేసుకుంటూ తమ గ్రామంలో చాలా విద్యుత్‌ స్తంభాలు వాలి, మధ్యలో ఇరిగి పోయి ఉన్నాయని, వీటిపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి ఎఇ వివరణ ఇస్తూ గ్రామంలో స్తంభాలు గాని, వైర్లు గాని పాడైపోయిన వాటికి సరిపడా డబ్బును చెల్లించాలని, లేదా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి.వద్ద గాని లెటర్‌ తీసుకువస్తేనే కొత్తవి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పంచాయతీల్లో రూపాయి లేకుండా వుంటే ఇప్పుడు వీటిని ఎక్కడ నుండి తేవాలని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపిపి జి.రాములమ్మ, వైస్‌ ఎంపిపి సువ్వాడ గుణవతి, ఎఎంసి చైర్‌ పర్సన్‌ దండి అనంతకుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డి పద్మావతి అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.