Nov 09,2022 23:24

మండల సర్వసభ్య సమావేశంలో నిలదీస్తున్న సభ్యులు

ప్రజాశక్తి -కోటవురట్ల: మండల సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ అప్పలనాయుడు, జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం వాడి వేడీగా జరిగింది. పలు శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం పట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, విద్యుత్‌ శాఖ, విద్యాశాఖ, ఉపాధి హామీ సహా తాండవ కాలువ అధికారులు హాజరు కాకపోవడం పట్ల సభ వాయిదా వేయాలన్న అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. దీంతో, ఎంపీడీవో చంద్రశేఖర్‌ కలుగజేసుకొని సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులకు నోటీసులు అందజేస్తామన్నారు.
ఖరీఫ్‌ పంట చివరి దశకు చేరుకున్న సమయంలో తాండవ నీరు అందకపోవడం పట్ల నీలిగుంట సర్పంచ్‌ వరహాల బాబు సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, సభకు హాజరు కాకపోవడంపై బికేపల్లి ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, చిన్న బొడ్డేపల్లి సర్పంచ్‌ శివప్రసాద్‌ సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ ఏపీవో సమావేశానికి డుమ్మా కొట్టి చౌడువాడలో ఉపాధి హామీ గ్రామ సభకు హాజరైనట్లు తెలుసుకున్న ఎంపీడీవో ఫోన్‌ ద్వారా సమాచారం అందించి తక్షణమే సభకు హాజరు కావాలని చెప్పారు. దీంతో, ఆలస్యంగా వచ్చిన ఏపీవో గంగు నాయుడుపై పలువురు ఎంపీటీసీ, సర్పంచ్‌లు పలు సమస్యలపై నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన ఏపీవో భావోద్వేగానికి లోనై గౌరవ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు సభ్యులు తక్షణమే ఆయనను సంబంధిత శాఖ అధికారులకు సరెండర్‌ చేయాలని పట్టుబట్టారు.
అనంతరం ఈఓపిఆర్డి ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఇటీవల గ్రామ పంచాయతీలకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులతో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని సభ దృష్టికి తీసుకువెళ్లడంతో, వచ్చిన కొద్దిపాటి సొమ్ము కరెంటు బకాయిలు చెల్లిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికుల వేతనాలు తదితర బకాయిలు ఎలా చెల్లించాలని తంగేడు గ్రామ సర్పంచ్‌ శివప్రసాద్‌ సహా పలువురు సర్పంచులు నిలదీశారు. గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరు కరుణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనుల ద్వారా ఇంటింటికి కుళాయి పనులపై వివరిస్తున్న తరుణంలో, కొడవటిపూడి సర్పంచ్‌ అప్పారావు, ఎంపీటీసీ సభ్యులు సూర్యప్రకాష్‌ కలుగజేసుకుని ముందుగా ట్యాంకు నిర్మాణం చేపట్టకుండా పైపులైను పనులు చేయడంతో ఉపయోగం లేదని ఆమెను నిలదీశారు. అనంతరం కలుగజేసుకున్న జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఇంటింటికి కొళాయి పథకంలో పలు గ్రామాలలో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని అటువంటివి జరగకుండా చూడాలన్నారు.
వైస్‌ ఎంపీపీ చెక్క సుజాత మాట్లాడుతూ, సుంకపూరు, జల్లూరు గ్రామాలకు సంబంధించి ఎటువంటి అధికారిక అభివృద్ధి కార్యక్రమాలుకు తమకు సమాచారం తెలియజేయలేదని, సచివాలయ, మండల పరిషత్‌ సిబ్బంది తమ పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం పై సభలో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులకు స్పందన ద్వారా ఫిర్యాదు చేస్తానన్నారు. అనంతరం పలు శాఖల అధికారులు చేపట్టిన చేపడుతున్న అభివృద్ధి పనులు సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల మండల అధికారులు, పలువురు సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.