
ప్రజాశక్తి-మునగపాక రూరల్
స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. వైసిపి సర్పంచులు, ఎంపీటీసీలు అభ్యంతరాలు, ప్రశ్నల పరంపరలతో సభ కొనసాగింది. వ్యవసాయ అధికారిని జోష్న కుమారి తన నివేదికను సభ్యులకు తెలియజేసే క్రమంలో సర్పంచులు వేదిక ముందుకు దూసుకొచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సచివాలయాలకు అందజేస్తున్న రూ.20 లక్షలు తమ ప్రమేయం లేకుండా ఖర్చు చేయటంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో సర్పంచులు ఉన్నారని వాడ్రాపల్లి సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీడీవో కార్యాలయం మరమ్మత్తులకు ఆయన ఖర్చు ఏ విధంగా, ఎంత జరిగిందో లెక్కలతో తెలపాలని ఎంపీటీసీ సభ్యులు పట్టుబట్టారు. స్వపక్ష సభ్యుల నుండి నిరసన వ్యక్తం కావడంతో ఎంపీపీ మల్ల జయలక్ష్మి సమాధానమిస్తూ సభ అయిన అనంతరం లెక్కలు మీ ముందు ఉంచుతామని, ఆ సొమ్మును ఎవరు బుక్క లేదని అనటంతో ఎంపీటీసీ సూరిశెట్టి రాము ఆమె మాటలకు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. సభను బహిష్కరించి బయటకు వెళ్లే ప్రయత్నం పలుమార్లు ఎంపీటీసీ సభ్యులు చేయగా వారిని వారించే ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి. కార్యక్రమంలో జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, ఎంపీడీవో మన్మధరావు, డిప్యూటీ తహశీల్దార్ వినరు కుమార్, ఏవో ప్రసాద్ కుమార్, ఈఓపిఆర్‌డి పెంటకోట ఈశ్వరరావు పాల్గొన్నారు.