Aug 01,2021 11:02

నా చెప్పులు అందుబాటులో లేక
వాడి చెప్పులేసుకుని బయటకొచ్చాను
వచ్చానేగానీ
మనసు నిండా ఏదో
భావ సంచలనం

వాడు బుడిబుడి అడుగులేస్తున్నప్పుడు
నా చెప్పులు కాళ్ళకు తగిలించుకుని
నోటితో ఏవేవో సౌండ్లు చేసుకుంటూ
ఆడుకున్న దృశ్యం తియ్యగా మెదిలింది
వాడి చెప్పులేసుకుని దారెంబట
ఇప్పుడు నేను ఆడుకుంటున్నట్టపిస్తుంది

నా కంటే జానెడు పొడవుతో
పక్కన నిలబడి భుజంపై చెయ్యేస్తాడా
నేను తలెత్తి పైకి చూస్తాను
ప్రతిసారీ ఒక సంశయం
నన్ను తొలుస్తుంటుంది
వాడు పెద్దోడా...!?
నేను పెద్దోడ్నాని
ప్రతీసారీ ఒక సందేహం నన్ను గుచ్చుతుంటుంది
వాడు చిన్నోడా...!?
నేను చిన్నోడ్నాని

నిన్న మొన్నటివరకు
నా చెప్పులేసుకోవటానికి
సంబరపడ్డ చంటోడు
వాడి చెప్పులిచ్చి నన్ను
సంబరపడమంటున్నట్టుంది
వాడి చెప్పులేసుకుని నడుస్తుంటే
నులివెచ్చని సందిగ్ధాల నడుమ
ఇప్పుడు నేను సంబరపడుతున్నట్టుంది

నా పొడవాటి చెప్పుల్లో
వాడి చిట్టిపాదాలు
పడుతూ లేస్తుండేవి
జీవితంలో పడటం, లేవటం అప్పటి నుంచే
మొదలౌతుందేమో మరి
ఇప్పుడు వాడి పొడవాటి చెప్పుల్లో
నా పొట్టిపాదాలు దూర్చి చంటోడినై
వాడిలో మళ్ళీ మళ్ళీ
మా నాన్నని చూస్తూ వుంటాను
 

బంగార్రాజు కంఠ
85003 50464