గాయమైనప్పుడే గేయమై
గుండె గొంతు పెగల్చడం
నొప్పి తగ్గాక అక్షరమై
లక్ష్యంలేకుండా పడుండటం
నిజమెరిగి నోరువిప్పని
పొద్దు తిరుగుడు పువ్వే
ఉద్యోగైనా, మేధావి అయినా
విద్యాధికుడినని విర్రవీగినా
అలలపై కలలు నడిపేవాడు
పూతాకాతాలేని ఉత్త మోడే
నష్టమైనా కష్టాన్ని నమ్మి
కష్టఫలం దక్కాలంటూ
చెమట చుక్కలే అక్షరాల్జేసి
భావాలకు రాగాలు కడుతూ
వాడితేలి వేడి పుట్టించేవాడు
కాషాయ, ఖద్దరు సుద్దులన్నీ
కలవారి కొలనులో పూలేనని
తీరం చేర్చే దారులు కావంటాడు
సూర్యాస్తమయాలు ఎన్నున్నా
కర్రదెబ్బలెన్ని రూపాలు మారి
వాయిస్తున్నా డప్పై మోగుతూ
నిత్యం నలిగినా వెలిగే సూరీడే
గాయాలు మాన్పే కలువ రేడు
- ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814