Aug 16,2022 00:23

మృతిచెందిన లక్ష్మ్మి

ప్రజాశక్తి-పెందుర్తి: జివిఎంసి 97వ వార్డు పరిధి సుజాతనగర్‌ సమీపంలోని నాగమల్లి లే-అవుట్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి కాపలాదారుగా ఉన్న అప్పికొండ లక్ష్మి (46)ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంనకు చెందిన అప్పికొండ లక్ష్మి (46), భర్త దేముడు (55) కలిసి ఒక అపార్ట్‌మెంట్‌కు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. గత రాత్రి తాను ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భార్యను హత్య చేశాడంటూ లక్ష్మి భర్త దేవుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు.
వారం క్రితం వృద్ధ దంపతుల హత్య
వారం రోజుల క్రితం ఇదే వార్డు పరిధిలోని చినముషిడివాడలో అపార్ట్‌మెంట్‌ కాపలాదారులుగా పనిచేస్తున్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే మరో మహిళ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. వరుస ఘటనలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మూడు హత్యలూ ఒకరే చేశారా.. లేక వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.