
లక్నో : పాల ఉత్పత్తులు, చక్కెర, బేకరీ వస్తువులు, పిప్పరమెంట్ ఆయిల్, స్నాక్ ఐటెమ్స్, ఎడిబుల్ ఆయిల్ వంటి ఉత్పత్తులపై హలాల్ లేబుల్ ప్రచురించడంపై యోగి ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తుల నాణ్యతను నిర్థారించడంపై 2006లో చేసిన చట్టానికి విరుద్ధమని రాష్ట్ర ఆహార కమిషనర్ కార్యాలయం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హలాల్ లేబుల్ వినియోగదారులలో గందరగోళాన్ని సృష్టిస్తుందని యోగి ప్రభుత్వం ఆరోపించింది. ఆహార ఉత్పత్తుల నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కమిషనర్ అనితా సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారుల మధ్య గందరగోళాన్ని సృష్టించడం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. రాష్ట్రంలో హలాల్ బ్రాండెడ్ వస్తువుల ఉత్పత్తి, నిల్వ మరియు పంపిణీని నిషేధించారు.