నోరు వితీప్పితే అబద్ధాలాడడం, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం బిజెపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి అబద్ధాల ఫ్యాక్టరీ లోని బిజెపి పార్లమెంటు సభ్యులు జివిఎల్ నరసింహారావు, వారి ఎమ్మెల్సీ మాధవ్ కలిసి ఇటీవల విశాఖపట్నం, విజయనగరంలో వేర్వేరు సమావేశాలలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడానికి పూనుకున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ, మరి ఉత్త్రరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ఎందుకయ్యా ఇవ్వలేదు అంటే, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని సెలవిచ్చారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అలా చేస్తే లెక్కలడగాలి గాని ఆ పేరుతో అసలుకే ఎగనామం పెట్టేస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందెంత దుర్వినియోగం అవడానికి? వెనకటికొకడు ఒకడికి పావలా ఇచ్చి పండగ చేసుకోమన్నాట్ట. అలా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ముష్టి వంద కోట్లిచ్చి అభివృద్ధి చేసేసుకోండని చేతులు దులిపేసుకుంది. ఈ వంద కోట్లతో వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలరు? ఏ నీటి ప్రాజెక్టును పూర్తి చేయగలరు? ఏ పరిశ్రమను స్థాపించి, స్థానికులకు ఉపాధి కల్పించగలరు? అనే కనీస ఆలోచన కూడా కేంద్రానికి ఎలాగూ లేదు సరే. మరి రాష్ట్రానికి చెందిన ఈ నాయకుల బుర్రల్లో కూడా లేకపోవడం వీరు రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఉమ్మడిగా చేస్తున్న ద్రోహానికి నిదర్శనం. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే గ్రామీణ పేదరికం నిర్మూలించబడేలా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన కనీసం 30 వేల కోట్ల రూపాయలను కేంద్రం నుండి సాధించి, అప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామంటే అర్ధముంది. కానీ, పైసా విదల్చకుండా ఏదో చేసేశామని పిట్టల దొరల్లా కబుర్లతో ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం వీరి దుర్నీతికి నిదర్శనం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం, మొత్తం కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేయడంలో భాగమేనని వీరు సెలవిస్తూ, ఇక్కడ సెంటిమెంట్లకు తావు లేదని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అవును మరి. కార్పొరేట్ సేవలో మునిగి తేలుతున్న మోడీ ప్రభుత్వానికి ఏ సెంటిమెంటూ అడ్డు రాదు. అయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ దీనిని నిస్సిగ్గుగా సమర్ధించుకోవడం మాత్రం నిస్సందేహంగా తనను గెలిపించిన ప్రాంతానికి నమ్మకద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు.
రైల్వే జోన్ పై వీరి వాదన మరీ చిత్రంగా ఉంది. ఇంకా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఇంకెన్నాళ్ళు, వేటిని పరిశీలిస్తారు? ఏడేళ్లు సరిపోవా? ఇంకా విచిత్రంగా ఎమ్మెల్సీ అయితే, కోవిడ్ వల్ల రైల్వే నష్టాలలో ఉందని, అందువల్లే ఆలస్యమైందని తమ నిర్వాకాన్ని అర్ధం పర్ధం లేని కారణంతో సమర్ధించుకుంటున్నారు. పోనీ ఇది సరే అనుకున్నా ఇప్పుడంటే కోవిడ్. మరి ముందు ఆరేళ్లు ఏం ఉద్ధరించినట్లు? అయినా స్పెషల్ ట్రైన్ల పేరుతో ఉన్న రాయితీలన్నీ ఎత్తేసిన రైల్వేకు లాభాలే కానీ నష్టాలెందుకొస్తాయి?
రాష్ట్ర విభజన చట్టం చేసి ఏడేళ్లయినా ఉత్తరాంధ్రలోని ఐఐఎం, పెట్రోలియం యూనివర్శిటీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కారణం కేంద్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకపోవడమే. గిరిజన యూనివర్సిటీకయితే ఇంకా స్థల సేకరణే జరగలేదు. విశాఖ మెట్రో రైల్ ఊసే ఎత్తడం లేదు. ఇలా అన్ని విధాలుగా రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేస్తున్న బిజెపి, ఆ పార్టీ నేతలు ప్రజలను పక్క దారి పట్టించేలా మత భావాలు రెచ్చగొట్టి, పబ్బం గడుపుకునే స్థాయికి దిగజారారు. విభజన చట్టం లోని అంశాలు అమలు కాకపోవడం వల్ల ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ఎన్నడూ నోరు మెదపని ఎమ్మెల్సీ...రామతీర్థం పరిగెట్టి రాముడికి అన్యాయం జరిగిపోయిందని గోల చేయడం... విశాఖలో ఆవు చనిపోయిందని దానికి నివాళి అర్పించడం వంటివి వీరి కుత్సిత రాజకీయాలకు పరాకాష్ట.
తమ ప్రాంతం బాగు, దాని అభివృద్ధి గురించి ప్రయత్నించడం అసలైన ఏ ప్రజా ప్రతినిధి అయినా చేస్తారు. అయితే ఈ ఎమ్మెల్సీ మాత్రం కనీస ప్రయత్నం కూడా చేయకుండా, కేంద్రం కుట్రలో భాగమవడం ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేయడమే.
నిజంగా వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజన చట్టంలోని అంశాల అమలు, స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు చేబడితే ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టడానికి, తమ ఘనకార్యాలను సమర్ధించుకోవడానికి తప్పుడు వాదనలు చేస్తే ప్రజలు అర్ధం చేసుకోలేరనుకోవడం మాత్రం అవివేకమే.
కె. లోక్ నాథం - / వ్యాసకర్త - సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి /










