Jun 06,2023 23:59

మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, చిత్రంలో సిపిఎం నేత కె.లోకనాథం, టిడిపి నేత నాగజగదీశ్వరరావు, సిపిఐ నాయకులు ఓబులేసు తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణమే శరణ్యమని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సీపీఐ అనకాపల్లి జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్‌ హాల్లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధనకై ఉత్తరాంధ్ర సదస్సు సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, టీడీపీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు విజయనగరం కార్యదర్శి మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ దొందూ దొందేనన్నారు. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఉత్తుత్తి ఆంధ్ర అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తప్ప ఉత్తరాంధ్ర అనుబంధ ప్రాజెక్టులు పూర్తి కావని స్పష్టం చేశారు. డిపిఆర్‌కు అనుగుణంగా దక్కాల్సిన బడ్జెట్‌ను కేంద్రం నుంచి రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి జనాలను సమీకరించి ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజాన దొరబాబు, మాకిరెడ్డి రాము నాయుడు, జి.గురుబాబు, కెఎస్‌ సన్యాసిరావు, అప్పలరాజు, వైఎన్‌ భద్రం, మాధవరావు, నాగరాజు, వియ్యపు రాజు, ఫణీంద్ర, సత్తిబాబు తదితరాలు పాల్గొన్నారు.