Mar 08,2023 23:51

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ

ప్రజాశక్తి-అనకాపల్లి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధితో పాటు సిపిఎస్‌ రద్దు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిష్కారం, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, జిఒ నెంబరు 3 పునరుద్ధరణ వంటి పలు అంశాలపై శాసనమండలిలో ప్రస్తావిస్తానని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ చెప్పారు. స్థానిక దొడ్డి రామినాయుడు కార్మిక, కర్షక భవనంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం హామీ ప్రకారం వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు ఉత్తరాంధ్ర జిల్లాలకు రాబెట్టేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు. 250కిపైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపర్చిన అభ్యర్థిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. రూ.3.50 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రూ.30వేల కోట్లకు విక్రయించే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి కృషి చేస్తాననిచెప్పారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పోరాడతానన్నారు. ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యల కోసం పనిచేసే వేదిక పిడిఎఫ్‌ అని తెలిపారు. పిడిఎఫ్‌ తరపున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే ఆయా తరగతుల సమస్యలపై పనిచేస్తానన్నారు. స్కీం వర్కర్ల సమస్యలపై కూడా శాసనమండలిలో ప్రస్తావించి వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. ఉత్తరాంధ్రలో మూతపడ్డ సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడితెస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.వరలక్ష్మి, ఎల్‌ఐసి ఉద్యోగుల యూనియన్‌ నాయకులు మళ్ల చంద్రశేఖరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు, గొర్రెలు, మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా శ్రీరామ్‌, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘం నాయకులు బి.ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.