ప్రజాశక్తి-సీతమ్మధార : హైకోర్టు అనుమతులిచ్చిన ఉత్తరాంధ్ర పొలికేకకు నగర పోలీస్ కమిషనర్ తిరస్కరణతోనే వైసిపి ప్రభుత్వ పతనం ప్రారంభమైందని, జైభీమ్ భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ అన్నారు. శనివారం పౌర గ్రంథాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పులికేక సభకు హైకోర్టు ఇచ్చిన అనుమతి పత్రాలు చూపినా సిపి శ్రీకాంత్ వైసిపి కార్యకర్తలా వ్యవహరించి తిరస్కరించడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై సిపి శ్రీకాంత్, జివిఎంసి కమిషనర్లపై కోర్టుధిక్కరణ పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు. డాక్టర్ సుధాకర్ పేరు పెట్టడమే ఇబ్బంది అయితే, పేరు కూడా తొలగిస్తామని చెప్పినా అనుమతులు నిరాకరించారన్నారు. విశాఖ విచ్చేసిన పవన్ కల్యాణ్‌ను వైసిపి ప్రభుత్వం బలవంతంగా తరిమేసిందన్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడనీయకుండా నియంతలా వ్యవహరిస్తున్న వైసిపికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అనుమతులు ఇవ్వకపోవడానికి తమదేవైనా నిషేధిత జాబితాలో ఉన్న మావోయిస్టు సంస్థ అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ కన్వీనర్ కారం మమత, వినరు, కార్యకర్తలు పాల్గొన్నారు.










