ప్రజాశక్తి -బెలగాం : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక వాసవీ కాలేజీతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వి.ఇందిర, జి.వెంకటరమణ బిజెపి ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపైన అనుసరిస్తున్న వైఖరిని వాడవాడలా ప్రజలకు తెలియజేసేందుకు సిపిఎం బైక్‌ర్యాలీ చేపట్టిందన్నారు. ఉత్తరాంధ్రవాసులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన చేస్తున్నారని, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈనెల 20నుంచి 29 వరకూ సిపిఎం ఆధ్వర్యాన బైక్ ర్యాలీ చేపట్టిందన్నారు. ఈ ఇందులో భాగంగా ఈనెల 23,24 తేదీల్లో రానుందన్నారు. ఇందులో 24న స్తానిక ఆర్‌టిసికాంప్లెక్స్ వైయస్సార్ విగ్రహం దగ్గరజరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యమ్మల మన్మధరావు, బి.సూరిబాబు, డివైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిపిఎం చేపడుతున్న ఉక్కు రక్షణ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ కోరారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురంలో గోడపోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బిడ్డిక శంకరరావు, బిడ్డిక ఆడిత్తు, ఎం.సన్యాసిరావు, పి.మోహన్‌రావు ఉన్నారు.
పాలకొండ : విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై చేపడుతున్న బైక్ యాత్ర శనివారం పాలకొండ రానుందని, దీన్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కన్వీనర్ దావాల రమణారావు కోరారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను పట్టణంలో ఇంటింటికి పంపిణీ చేశారు.
సీతానగరం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని బూర్జ, నిడగళ్లులో ఈనెల 24న జరిగే బైక్ యాత్రను, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్, నాని, బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.










