Nov 10,2022 00:05

విలేకర్లతో మాట్లాడుతున్న రమాప్రభ, చిత్రంలో త్రిమూర్తులురెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి రమాప్రభ
ప్రజాశక్తి- సీలేరు

రానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల బలపర్చిన పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ అన్నారు. బుధవారం సీలేరు వచ్చిన ఆమె పట్టభద్రులను కలిసి తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉన్న జీవ నదులపై ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమని చెప్పారు. దీంతో ఇక్కడ పనుల్లేక రైతులు కూలీలు వలసబాట పడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి దశాబ్దాలు గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడున్న పట్టభద్రులు వేరే పట్టణాలకు వలస పోతున్నారన్నారు. వలసలను అరికట్టడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు ఉపాధి ఇస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే శాసనమండలిలో ఉత్తరాంధ్ర వాణిని వినిపిస్తానని, ఈ ప్రాంతంలో పోరాడే వారి తరుపున నిలబడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కె.త్రిమూర్తులు రెడ్డి, గాలకొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు పాల్గొన్నారు.