న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అంతర్గత విభేదాలతో రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్‌ను బిజెపి.. పార్టీ నుండి బహిష్కరించింది. రావత్‌ను కేబినేట్ నుండి తొలగించడంపై గవర్నర్‌కు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి లేఖ రాసినట్లు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆరేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా బిజెపి తొలగించింది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు.. ఆ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న పార్టీ దృష్టికి వచ్చినట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే హరక్ సింగ్ రావత్.. నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అయితే గత నెలలో పుష్కర్ ధామి.. హరక్ సింగ్ నివాసంలో రాత్రి భోజనం చేశారు. దీంతో ఊహాగానాలకు తెరపడినట్లైంది.










