Mar 12,2021 07:20

  ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా, పదవ సి.ఎం గా తీరథ్‌ సింగ్‌ రావత్‌ ప్రమాణ స్వీకారం చకచకా జరిగిన పరిణామాలే అయినా రాష్ట్ర రాజకీయాలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. సొంత పార్టీ నేతల నుండి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో సి.ఎం మార్పు జరిగినట్టు చెబుతున్నా మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బిజెపి అధిష్టానం పథకం ప్రకారం చేసిన మార్పులా కనిపిస్తోంది. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నాయకత్వంపై ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని పరిశీలించేందుకు అధిష్టానం పనుపున హుటాహుటిన రాష్ట్రానికి వెళ్లిన ఇద్దరు సీనియర్‌ నేతలు జాతీయ అధ్యక్షునికి నివేదిక సమర్పించారు. అనంతరం వచ్చిన వార్తల్లో తదుపరి సి.ఎం ధన్‌సింగ్‌ రావత్‌ అంటూ అత్యధిక మీడియా సంస్థలు వార్తలిచ్చాయి. అజరు భట్‌, అనిల్‌ బులానీ వంటి పేర్లూ చక్కర్లు కొట్టాయి. కాని, అమిత్‌షా కు అత్యంత సన్నిహితుడైన గర్వాల్‌ ఎం.పి తీరథ్‌ సింగ్‌ రావత్‌ బుధవారంనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పునాదిగల తీరథ్‌ సింగ్‌ను సి.ఎం గా చేయడం వ్యూహాత్మకమే! ప్రజల ఆదాయాలు పడిపోయి జీవన ప్రమాణాలు దిగజారడం, నిరుద్యోగం ప్రబలడం, అవినీతి పెచ్చరిల్లడం, శాంతి భద్రతలు సన్నగిల్లడంతో త్రివేంద్ర పాలన రోసిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తే తమ ఓటమి ఖాయమని అంచనాకొచ్చిన కమలనాథులు ముఖ్యమంత్రి మార్పునకు తెర తీశారు. జనం బతుకులు దిగజారడానికి బిజెపి విధానాలే కారణం తప్ప ఒకరిద్దరు నాయకుల వ్యవహార శైలి కాదన్నది వాస్తవం. కాని ఆ విధానాల పర్యవసానంగా ప్రభుత్వం మీద ప్రజలకు పెరుగుతున్న వ్యతిరేకతను వ్యక్తుల వైపు మళ్లించి, వారిని తప్పించడం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చాలన్నదే ఈ మార్పు వెనుక ఆంతర్యం.
  ఉత్తరాఖండ్‌ ఏర్పడిన ఈ ఇరవై ఏళ్లలో తొమ్మిది మంది ముఖ్యమంత్రులు పోయి, పదవ సి.ఎం గా తీరథ్‌ గద్దెనెక్కారంటే సగటున రెండేళ్లకొకరు మారారన్నమాట! భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినవాటిని చిన్నచిన్న ముక్కలు చేస్తే రాజకీయ అనిశ్చితి పెరుగుతుందని పలువురు చెప్పిన మాట నిజమని తేలింది. ఆ సంగతి అలా ఉంచితే, ఒక కోటి జనాభాగల చిన్నరాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఈ పరిణామాలు తలెత్తడం ఆందోళనకరం. గతంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లను ముక్కలు చేయాలని బిజెపి వాదించింది. బెంగాల్‌ లో గూర్ఖాల్యాండ్‌ వేర్పాటువాదాన్ని ఎగదోసింది. రాయలసీమతో సహా దేశవ్యాప్తంగా విచ్ఛిన్నకర డిమాండ్లన్నీ బిజెపి ముందుకు తెచ్చినవి లేదా బలపర్చినవే. ఉత్తరాఖండ్‌లో మత విద్వేష రాజకీయాలను ఎగదోయడం హానికరం. మత చిచ్చును రెచ్చగొట్టి, ఆ మంటలతో చలి కాచుకోవడంలో ప్రథమునిగా విశ్లేషకులు పేర్కొనే అమిత్‌షా కు అత్యంత సన్నిహితుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడం ఓ ప్రమాదకర సంకేతం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోవిడ్‌ అదుపు గురించో, ప్రజల సమస్యలపైనో కాకుండా శివరాత్రి స్నానాలకు ఏర్పాట్లను సమీక్షించారంటేనే తీరథ్‌ ప్రాధాన్యతలేమిటో విదితమవుతోంది.
  పదవీ కాలం పూర్తయ్యే వరకు బిజెపి ముఖ్యమంత్రుల్ని మార్చబోమన్న మాట కూడా నిజం కాదని ఉత్తరాఖండ్‌ పరిణామాలతో స్పష్టమవుతోంది. సి.ఎం ను మార్చాలని అధిష్టానం అనుకుంటే ఆగమేఘాల మీద అమలు జరిపేస్తారు... లేకపోతేనే అలాంటి వాదనల్ని ప్రచారం చేస్తారు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ ఉందని చెప్పిన 'మేధావి', కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాది అయిన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ ను కొనసాగించాలని మోడీ-షా ద్వయం భావించింది కనుకనే ఎందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి, అసమ్మతి వ్యక్తం చేసినా ఆయన పీఠానికి ఢోకా రాలేదు. అలాగే అవినీతి చక్రవర్తిగా పేరొందిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు కోసం పలువురు ప్రయత్నించినా అదీ జరగలేదంటే ఢిల్లీ పెద్దలకు ఆయన 'కావలసిన వాడే'నన్నమాట. కనుక 'బిజెపి నేతల మాటలకు అర్థాలు వేరు' అని అందరూ అర్థం చేసుకోవాలి. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో (గుజరాత్‌ మినహా) అన్నిటా బిజెపి ఓడిపోయింది. పంజాబ్‌, ఢిల్లీ వంటి చోట్ల మూడో స్థానానికి దిగజారింది. బిజెపి విధానాలతో నలిగిపోతున్న జనం చెబుతున్న పాఠం ఇది. అయితే జనం నుండి పాఠాలు నేర్చుకుని తన వైఖరిని సరిదిద్దుకునే ప్రజాస్వామ్య స్వభావం బిజెపి కి తొలి నుంచీ లేదు. అందుకే ఈ తరహా జిమ్మిక్కులు.