ప్రజాశక్తి - భీమడోలు
విధుల నిర్వహణలో సమర్థవంతమైన సేవలు అందించిన భీమడోలు డిప్యూటీ తహశీల్దార్ షంషుద్దీన్, పొలసానిపల్లి విఆర్‌ఒ సింహాచలం సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని భీమడోలు తహశీల్దార్ ఎం.ఇందిరాగాంధీ తెలిపారు. వీరివురు తాము అందించిన సేవలకుగాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులో మంత్రి విశ్వరూప్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను మంగళవారం స్వీకరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఒలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు సకాలంలో పరిష్కారం, ఓటర్ల జాబితా, తాజా సర్వే సమర్థవంతంగా నిర్వహించడం, సమగ్ర భూ సర్వే కార్యక్రమం మండల స్థాయిలో సజావుగా అమలు అయ్యేందుకు ఏర్పాటు చేసిన బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ తహశీల్దార్ షంషుద్దీన్ సేవలు అభినందనీయమన్నారు. ఇదేవిధంగా విఆర్‌ఒగా సింహాచలం గ్రామపంచాయతీ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని తహశీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమారి, విఆర్‌ఒల సంఘ నాయకులు శంకర్ పాల్గొన్నారు.










