ప్రజాశక్తి-పాడేరు టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనుండగా యంత్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగమైంది. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లుగా పరీక్షలు సవ్యంగా నిర్వహించలేదు. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలను అనుకున్న సమయానికే తెరిచారు. తరగతుల నిర్వహణ ద్వారా సిలబస్ సైతం పూర్తి చేశారు. ఆ నేపథ్యంలో పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల ఎటిడబ్ల్యూఒలు, పాఠశాలల హెచ్‌ఎంలతో ఉన్నతాధికారుల సమీక్షలు పూర్తయ్యాయి. గతేడాది పదిలో కేవలం 68 శాతం ఉత్తీర్ణత సాధించగలిగారు. ఈ ఏడాది పదిలో శత శాతమే లక్ష్యంగా హెచ్‌ఎంలు, ఆయా సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటిడిఎ పిఒ ఆర్.గోపాలక్రిష్ణ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో 57 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలుకు పాడేరు డివిజన్ స్థాయిలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, మండల స్థాయిలో ఎటిడబ్ల్యూఒలు, పాఠశాల స్థాయిలో హెచ్‌ఎంలు, ఆయా సబ్జెక్ట్ టీచర్స్ కృషి చేస్తున్నారు. టీచర్స్ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ పదో తరగతి పరీక్షల్లో శత శాతం సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రతిభను పదును పెట్టేలా రేయి, పగలు కష్టపడి చదువుతున్నారు.
ఐటిడిఎ పరిధిలోని పాడేరు డివిజన్ 11 మండలాల వ్యాప్తంగా 5,013 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా 39 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. 106 జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలల్లోని 2,225 బాలురు, 2,788 బాలికలు మొత్తం 5,013 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్షల్లో ప్రత్యేక నిఘా, సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్, ఐటిడిఎ పిఒ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. విద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో ఎలాంటి అవంతరాలు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
యాక్షన్ ప్లాన్ అమలు..
ఐటిడిఎ కార్యాలయం విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని, దీంతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని తలారిసింగి జిటిడబ్ల్యూ పాఠశాల హెచ్‌ఎం, సబ్జెక్ట్ టీచర్లు చెబుతున్నారు. పాఠశాలలో 89 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడానికి టీచర్స్ ప్రత్యేక తరగతులతో పాటు, స్టడీ అవర్స్, రోజు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను దగ్గరుండి చదివిస్తూ, వారి సందేహాలు నివృత్తి చేస్తున్నారు. శత శాతం తమ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రోజు రోజుకూ విద్యార్థుల్లోని ప్రతిభ మెరుగు పరుస్తూ, మంచి మార్కులు వచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు.
శత శాతం ఫలితాలకు చర్యలు..
- సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షలు ఫలితాలు ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తర్ఫీదు ఇస్తున్నారు. పది పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఎంతో భయం ఆ భయాన్ని పోగొట్టి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించేలా మానసిక స్తైర్యాన్ని నింపేలా అందుకు తగిన సూచనలు చేస్తున్నారు. నిపుణులు తయారుచేసిన మాదిరి ప్రశ్న పత్రాలతో సాధన చేయించడం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా సిద్ధం చేస్తున్నారు. జనవరి నెలాఖరుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ను పూర్తి చేయడం. ప్రతిరోజు ఉదయం ఒక గంట రాత్రి రెండు గంటలు ప్రత్యేక స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సబ్జెక్టుల రివిజన్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో డైలీ టెస్ట్ లు పెడుతున్నారు. ప్రతిరోజు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యేకమైన అసైన్ మెంట్‌లు ఇవ్వడం, రాయించడం చేస్తున్నారు. డైలీ టెస్ట్ లను ఏరోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని అదే రోజు అందరికీ తెలియజేయడం వెనకబాటునకు గురైన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వెనకబడిన విద్యార్థులకు అవసరమైన మార్కులు వచ్చేలా ఆయా అంశాలపై ప్రత్యేక తరగతులు బోధించడం, అలాగే విద్యార్థులపై సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టి పరీక్షల సమయానికి వారి స్థాయిని పెంచుతున్నారు. వార్షిక పరీక్షలపై విద్యార్థులకు భయం పోగొట్టేలా డైలీ టెస్టుల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. 57 రోజులు ప్రత్యేక ప్రణాళిక విషయంలో విద్యార్థులు గైరహాజరు కాకుండా చూడడంతో పాటు వారిపై ఉపాధ్యాయుల నిత్య పర్యవేక్షణ చేస్తున్నారు.










