ప్రజాశక్తి-తెనాలి : నాటక కళామతల్లికి వినూత్న హారం కొలంకపురి నాటక కళాపరిషత్ జీవిత సాఫల్య పురస్కారమని ప్రముఖ సినీ, నాటక, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. మండలంలోని కొలకలూరులో ఈనెల 5న ప్రారంభమైన కొలంకపురి నాటక కళాపరిషత్ ఇరు తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ముగింపు సందర్భంగా గోపరాజు వెంకట శివరామశర్మ జీవిత సాఫల్య పురస్కారంతో యండమూరిని సత్కరించారు. ప్రముఖ నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన పురస్కార సభలో యండమూరి మాట్లాడుతూ 75 ఏళ్ల తన రచనా ప్రస్థానంలో 20వ ఏట నుంచే సత్కారాలు, సన్మానాలు ప్రారంభమయ్యాయన్నారు. రఘుపతి రాఘవ రాజారామ్ నాటకంతో ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందానన్నారు. మనుషులొస్తున్నారు జాగ్రత్త, రుద్రవీణ నాటకాల రచనలు మరింత గుర్తింపుకు దోహదం చేశాయని చెప్పారు. కొలంకపురి నాటక కళాపరిషత్ లాంటివి ఉన్నతం కాలం రంగస్థలానికి మనుగడకు కొదవలేదన్నారు. తన రచనలో శైలి, శిల్పం, పాత్రధారణ, నాచురలిజమ్, అప్‌సెట్ థియేటర్ వంటి అన్నింటికీ ఆధ్యులైన గురువులు దేచిరాజు హనుమంతరావుకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
దర్శక దార్శనికుల గౌరవ సత్కారం
నాటిక పోటీల చివరి రోజున ప్రముఖ రంగస్థల సీనియర్ కళాకారులు, రచయితలు, దర్శకులకు దర్శక, దార్శనిక పురస్కారాలతో కళాపరిషత్ సత్కరించింది. సత్కారాలు పొందిన వారిలో కెఎస్‌టి సాయి, జిఎస్‌ఆర్‌కె శాస్త్రి, డిఎస్సార్ మూర్తి, ఎస్‌కె మిశ్రో, ఎంసి దాస్, బిఎం రెడ్డి, మల్లాల శివన్నారాయణ ఉన్నారు.
చివరి ప్రదర్శనగా ప్రేమతో నాన్న..
నాటిక పోటీల్లో చివరి ప్రదర్శనగా శ్రీ సాయి అర్ట్స్ కొలకలూరి వారి 'ప్రేమతో నాన్న' నాటికను ప్రదర్శించారు. భర్త పెట్టే హింస భరించలేక భార్య పడే వేదన, తల్లికి చెప్పుకుంటే పరువుకోసం సర్దుకుపోవాలని చెప్పటం, అప్పటికీ భరించలేని కుమార్తె బాధను గ్రహించిన తండ్రి ఆమెకు అండగా నిలుస్తాడు. కాపురానికి వెళ్లలేనని, భర్త పెట్టే బాధలు భరించలేనని కుమార్తె ప్రాధేయపడటం గమనించి, తనవద్దే పెట్టుకుని, తన కాపురం తనే సరిదిద్దుకోవాలని, భర్త పెట్టే హింసను తిప్పికొట్టాలని హితబోధ చేస్తాడు. అదే అజమాయిషీ చెలాయిస్తూ పుట్టింట్లో ఉన్న భార్య వద్దకు వచ్చిన భర్తకు గుణపాఠం ఇతివృత్తంగా నాటిక సాగింది. నాటికకు దర్శకత్వం గోపరాజు విజరు వహించారు. ప్రత్యక్షంగా నాటికను తిలకించిన యడమూరి నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు.
నాటిక పోటీల విజేతల వివరాలు
నాలుగు రోజులపాటు నిర్వహించిన నాటిక పోటీల విజేతల వివరాలను గోపరాజు విజరు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి 'అతీతం', ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా విశాఖపట్టణం తెలుగు కళాసమితి వారి ప్రదర్శన 'నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత', ఉత్తమ తృతీయ ప్రదర్శనగా ఏలూరుకు చెందిన హేలాపురి కల్చరల్ అసోసియేషన్ వారి 'మనసున మనసై' నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడుగా నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికలో కుమార్ పాత్రధారి ప్రసాద్, ఉత్తమ నటిగా దారుణం నాటికలో సుమలత, ఉత్తమ దర్శకులుగా అతీతం నాటిక దర్శకులు ఎస్.రవీంద్రరెడ్డి, ఉత్తమ రచయితగా దారుణం నాటిక రచయిత పరమాత్ముని శివరాం దక్కించుకున్నారు. విజేతలకు నగదు పారితోషకాలు, షీల్డులు బహూకరించారు. కార్యక్రమంలో గోపరాజు వెంకటరమణ, షేక్ జానిబాషా, సుద్దపల్లి మురళీధర్, భర్తిపూడి సుబ్బారావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.










