Nov 19,2023 00:44

ధాన్యం నమూనాలను సేకరిస్తున్న వ్యవసాయాధికారులు

ప్రజాశక్తి - ఆనందపురం, పద్మనాభం : ఆనందపురం మండలంలో బోని, పద్మనాభం మండలంలోని పాండ్రంగి గ్రామాల్లో ఉత్తమ పంటల యాజమాన్య పద్ధతులు (జిఎపి) వరి పంట ధ్రువీకరణలో భాగంగా ఎక్‌్‌సటర్నల్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.రవి శనివారం పరిశీలించారు. విశాఖ ఉద్యానవన ఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీతో ఒప్పందం చేసుకున్న 15 మంది రైతుల ధాన్యం నమూనాలను వారి పొలాలకు వెళ్లి సేకరించారు. ఈ నమూనాలను పురుగు మందులు, ఎరువుల అవశేషాలు ఎంత మోతాదులో ఉన్నాయో పరీక్ష కోసం బెంగళూరు ల్యాబ్‌కు పంపించారు. ఈ ఉత్తమ యాజమాన్య పద్ధతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం మంజూరైన తర్వాత రైతులు ధాన్యాన్ని ఎఫ్‌పిఒ ద్వారా మిల్లింగ్‌ చేసుకుని వచ్చిన బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకోవడమే కాకుండా వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసుకునే వీలు ఉంటుందని వివరించారు. మనదేశంలో మేలైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ పథకాన్ని అభివృద్ధి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమునిపట్నం వ్యవసాయ సహాయ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ చదువుల సుబ్రహ్మణ్యం, మండల వ్యవసాయాధికారులు సిహెచ్‌.సంధ్య రత్నప్రభ, ఎంవి.చలం, ఎఇఒ శ్రీనివాసరావు, విఎఎలు రమాదేవి, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.