ప్రజాశక్తి - భీమడోలు
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన మండలంలోని సూరప్పగూడెంను ఇతర గ్రామపంచాయతీలు ఆదర్శంగా తీసుకొని రానున్న కాలంలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలని భీమడోలు జెడ్‌పిటిసి సభ్యులు తుమ్మగుంట భవానిరంగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కె.రామయ్య కోరారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తొలిసారిగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేసింది. స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు గల గ్రామపంచాయతీగా భీమడోలు మండలం సూరప్పగూడెం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. గ్రామపంచాయతీ అధ్యక్షులు వెజ్జు బాలాజీ, గ్రామపంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, ఎంపిటిసి సభ్యులు ఇంజేటి జూనియర్ గ్రామపంచాయతీ తరపున సత్కారం పొందేందుకు సోమవారం అమరావతికి వెళ్లారు. భీమడోలు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సమావేశ మందిరం వేదికగా అభినందన కార్యక్రమాన్ని సోమవారం ఇన్‌ఛార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి.సత్యనారాయణ నిర్వహించి గ్రామపంచాయతీ అధ్యక్షులతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, ఎంపిటిసి సభ్యులను సత్కరించారు.
రాష్ట్రస్థాయిలో సూరప్పగూడెం ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన నేపథ్యంలో సర్పంచిని తాడేపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాకుమారి సోమవారం సత్కరించి మెమెంటో అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, ఎంపిటిసి సభ్యులు ఇంజేటి జూనియర్ పాల్గొన్నారు
బుట్టాయగూడెం :జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం బుట్టాయగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 21 పంచాయతీల సర్పంచులకు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు మాట్లాడారు. మండలంలో అన్ని అభివృద్ధి పనులు చేయడానికి సహకరించిన, కృషి చేసిన సర్పంచులను సన్మానించారు.
ఉంగుటూరు : ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్పంచి, ఎంపిటిసి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ ఆంజనేయులు, ఇఒపిఆర్‌డి షంషిద్దీన్, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యురాలు కొరిపల్లి జయలక్ష్మి, మండల సర్పంచుల ఛాంబర్ అద్యక్షుడు విష్ణుమూర్తి, మండల సచివాలయం కన్వీనర్ డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సింగిరెడ్డి సూర్యనారాయణ పాల్గొన్నారు.
కైకలూరు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి కృష్ణమోహన్ మాట్లాడారు. పలు గ్రామాల సర్పంచులను, ఎంపిటిసి సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.శివాజీ, బలరామరాజు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రామలింగేశ్వరావు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ముసునూరు : మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ బసవరాజు అచ్యుత సత్యనారాయణ ఆధ్వర్యంలో ముసునూరు, చెక్కపల్లి, లోపూడి, అక్కిరెడ్డిగూడెం, వలసపల్లి, గుళ్లపూడి, కాట్రేనిపాడు, రమణక్కపేట, సూరేపల్లి, కోర్లగుంట గ్రామ పంచాయతీ సర్పంచులకు జెడ్‌పిటిసి వరికూటి ప్రతాప్, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయన, వైస్ ఎంపిపి-2 పాముల గంగధరరావు ఆధ్వర్యంలో అవార్డులు అందించి సత్కరించారు. మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన, సామాజిక భద్రత, సుపరిపాలన, మంచినీటి సమృద్ధి కల్పించడంతో పాటు పరిశుభ్రత కలిగిన గ్రామాలగా అభివృద్ధి చెందడంతో ఆయా గ్రామాల సర్పంచులను సత్కరించినట్లు వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయణ తెలిపారు.
జీలుగుమిల్లి : పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్క సర్పంచి కృషి చేయాలని ఎంపిడిఒ కె.మంగతాయారు అన్నారు. సోమవారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలో వివిధ విభాగాల వారీగా అభివృద్ధి జరిగిన తొమ్మిది పంచాయతీలకు అవార్డులు ఎంపిపి కోర్స పోసమ్మ చేతులమీదుగా అందించారు. అనంతరం సర్పంచులను సత్కరించారు.
దెందులూరు : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దెందులూరులో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎబిపివి.లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో చల్లచింతలపూడి, సోమవరప్పాడు, పెరుగుగుడెం, రామారావుగూడెం, పోతునూరు, కొవ్వలి, గోపన్నపాలెం, కొత్తగూడెం, గంగన్నగూడెం గ్రామ పంచాయతీలకు అవార్డులతోపాటు ప్రసంశా పత్రాలు అందించి ఘనంగా సన్మానించారు.
ముదినేపల్లి : జిల్లాస్థాయి ఉత్తమ పంచాయతీగా మండలంలోని పెదపపాలపర్రు గ్రామ పంచాయతీ ఎంపికైంది. ఈ మేరకు సోమవారం ఏలూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ చేతులమీదుగా జిల్లాస్థాయి ఉత్తమ పంచాయతీ పురస్కారం గ్రామ సర్పంచి గంటా రాకేష్‌కుమార్ అందుకున్నారు. రాకేష్‌ను పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు అభినందించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో పలువురు సర్పంచులను ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ సన్మానించారు.
పోలవరం :పోలవరం పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. పోలవరం పంచాయతీ సర్పంచి పొడుంపుష్ప అధ్యక్షతన ఎంపిటిసి సభ్యులు కాశీ ధనలక్ష్మి కొత్త పట్టిసీమ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులను సర్పంచి విజయదుర్గ, పంచాయతీ సెక్రటరీ తాతి విజరుకుమారి, సచివాలయ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, ఎంపిటిసి సభ్యులు ఉలవల వరలక్ష్మి, మైగాపుల దుర్గాప్రసాద్ పూలమాలలు వేసి సత్కరించారు.
జంగారెడ్డిగూడెం : మండలంలోని చక్రదేవరపల్లి గ్రామపంచాయతీకి మండల స్థాయిలో తృతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారం లభించింది. సోమవారం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీని నీటి సమృద్ధి కలిగిన గ్రామ పంచాయతీ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకు అభినందిస్తూ మండల స్థాయి తృతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని కేటాయించినట్లు ఎంపిడిఒ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో సర్పంచి సత్యనారాయణకు పురస్కారాన్ని ఎంపిడిఒ కిరణ్‌కుమార్, తహశీల్దార్ స్లీవజోజి, జెడ్‌పిటిసి సభ్యులు పి.బాబ్జి అందించారు. సర్పంచిని సన్మానించి మెమెంటో అందించారు.
మండవల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని వివిధ విభాగాలలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికైన ఆయా పంచాయతీలకు చెందిన సర్పంచి కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి అగస్తి ఆది విష్ణు, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ పి.మల్లేశ్వరి, ఇఒపిఆర్‌డి ఆనంద్‌బాబు, ఎఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.










