ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పండగలు, ఉత్సవాలు మానవ సంస్కృతిలో భాగం. ఇందులో కొన్ని ప్రకృతిపై మానవుడు సాధించిన విజయానికి సంబంధించినవి. మరికొన్ని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకునేవి. ఇంకొన్ని పూర్తిగా మత నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించినవి. వీటిలో రెండో కోవకు చెందినవే విజయనగరం ఉత్సవాలు. విజయనగరం జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య పరిమళాలను గుర్తుచేసుకుంటూ చాలా ఏళ్లుగానే ఉత్సవాలను పాలకులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఉత్సవాలు కొన్ని రంగాలకు చెందినవారికి, సాధారణ ప్రజానీకానికి, మీడియా ప్రతినిధులకు ఒకింత నిరుత్సాహాన్ని కలిగించాయి. అధికారులు, రాజకీయ నాయకులకు మాత్రం ఉత్సవాలు ఎంతో హామీని, ఆత్మీయతను అందించాయి.
ఉత్సవాలంటేనే అంతా కలిసికట్టుగా చేయడం. సామాన్యులను సైతం భాగస్వామ్యం చేయడం. అందుకనుగుణంగా అన్ని వర్గాలను కలుపుకొని విజయనగర ఉత్సవాలను, పైడితల్లమ్మ పండగను విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ , డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. కానీ, చాలామంది ప్రముఖులను కలుపు కోలేదనే భానవ వ్యక్తమౌతోంది. విజయనగరం కళలకు కాణాచి. కవులు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులకు పుట్టినిల్లు. కానీ, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించడంలో వెనుకబాటు ఉంది. ఆయా రంగాల్లో ప్రముఖులను కూడా రప్పించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మ్యూజికల్ నైట్‌కు విఐపి పాసులు వెయ్యి, వివిఐపి పాసులు 150 సిద్ధం చేసినా, అవన్నీ రాజకీయ నాయకుల అనుచరులకే వెళ్లినట్లు తెలిసింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా, వాటన్నింటినీ కలగాపులగం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక, ప్రయివేటు కార్యక్రమాలకు తేడా లేకుండా పోయింది. ఎంతో ప్రతిష్టాత్మక సురభి నాటక ప్రదర్శన జరుగుతున్న సమయంలో పులివేషాల పోటీ, డప్పుల మోతలు నటులను, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయి.
సిరిమానోత్సవంలో కవరేజ్ కోసం ఇచ్చిన మీడియా పాస్‌తో సైతం పాత్రికేయులను గుడి లోపలకు అనుమతించలేదు. ఈసారి ఆలయం వద్ద మీడియా ప్రతినిధులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు దర్జాగా విఐపి మార్గంలో వెళ్లి దర్శనం చేసుకోవడం కనిపించింది. పాసు చూపించినా బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. పైగా 'ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ పోలీసులు సవాల్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇదే సమయంలో ఎప్పటిలాగే కొంత మంది పోలీసు అధికారులు తమ వారిని విఐపి గేటు గుండా, ఆలయం వెనుక గేటు గుండా అమ్మవారి దర్శనానికి పంపించారు. గతంలో విజయ నగరం ఉత్సవ నిర్వహణ కమిటీలో మీడియా వ్యక్తులకు చోటుండేది. సీనియర్ పాత్రికేయులు ఈ కమిటీలో ఉండి, సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మీడియా కవరేజ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించి, తగు ఏర్పాట్లు చేసుకొనేవారు. ఈసారి అది కూడా కరువైంది. వారి అభిప్రాయాలను సైతం తెలుసుకొనే ప్రయత్నం ఏ కోశానా చెయ్యలేదు. ఉత్సవాలపై నిర్వహించిన మొట్ట మొదటి సమావేశంలో సైతం ఎక్కడా మీడియాకు చెందిన వ్యక్తుల అభిప్రాయాన్ని తీసుకోలేదు. చివరికి విజయోత్సవాల్లో సైతం మీడియాకు స్థానం లేకుండా పోయింది. వీటిని శనివారం రాత్రి జరుపుకున్నారు. తమకు తామే సన్మానాలు చేసుకొని, మెమోంటోలు పంచుకొని, తమ జబ్బలు తామే చరుచుకొని మురిసిపోయారు. రహస్యంగా విజయోత్సవ విందును ఆరగించిన మన జిల్లా యంత్రాంగం.. చివరికి ఆ విందు విశేషాలను ప్రజలకు తెలియజేయడానికి ఎప్పటిలాగే మీడియా గుర్తుకొచ్చింది. మరునాడు సమాచార శాఖ ద్వారా, పత్రికా ప్రకటన ఇప్పించి, తాము చేసిన ఘన కార్యాన్ని ప్రజలకు తెలియ జేయాలనుకోవడం విశేషం.
సమిష్టి కృషితో ఉత్సవాలు విజయవంతం
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో బాధ్యతగా పనిచేయడం వల్లే ఈ ఏడాది విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం విజయవంతమయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలను గమనిస్తున్నానని, ఈ ఏడాది వచ్చినంతగా ఉత్సవాలకు భక్తులు, ప్రజానీకం ఎన్నడూ హాజరు కాలేదని చెప్పారు. శనివారం రాత్రి నగరంలోని ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో విజయనగర, పైడితల్లమ్మ పండగలో సేవలందించిన జిల్లా అధికారులు, జీవితకాల సభ్యులకు మంత్రి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్‌పి ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ సరస్ పేరిట అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శన, సురభి నాటకాలు వంటి అదనపు ఆకర్షణలు ఈ ఏడాది తోడయ్యాయన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా విజయనగరంపై ఇతర ప్రాంతాల వారికి మంచి అభిప్రాయం ఏర్పడేలా కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభ్రదస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు కలెక్టర్ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌పి దీపిక, నగర డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయా యాదవ్, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ జీవితకాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.