సాలూరు: ప్రపంచ ఆదివాసీ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివాసీ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర కనుసన్నల్లో ఐటిడిఎ పిఓ విష్ణు చరణ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. సుమారు 6వేల గిరిజన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆహూతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. మన్యం జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే గిరిజన కళాకారులు, నృత్యకారుల ప్రదర్శనలకు వేదిక సిద్ధం చేశారు. థింసా, ఇతర గిరిజన సాంప్రదాయ నృత్యాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. అరుకు,పాడేరు, కురుపాం, రంపచోడవరం, పాలకొండ నియోజకవర్గాల్లో ఆదివాసీ ఉత్సవాల నిర్వహణ కు ఏర్పాట్లు చేసుకున్నారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి మన్యం జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంది.










