ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం దాకమర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఉత్సాహంగా యువజనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిబా పాటవాలను వెలికి తీసేందుకు ఈ తరహ యువజనోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. జెఎన్‌టియు, గురజాడ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ స్వామి నాయుడు మాట్లాడుతూ, యువత దేశభక్తి, క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. రఘు విద్యా సంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. యువ కేంద్రం అధికారి విక్రమాదిత్య మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలు
నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. యంగ్ ఆర్టిస్ట్, యంగ్ రైటర్స్, ఫొటోగ్రఫీ, వక్తృత్వం, ఆర్ట్స్ గేలరీ, కల్చరల్ ఫెస్ట్ విభాగాల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారుడు ఆర్.కరుణాకర్ రూపొందించిన చిత్ర కళా ఖండాలను ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.










