రన్‌ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో నగరంలోని ఏర్పాటుచేసిన శ్రీరామ్ సిటీ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. మారథాన్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, ఔత్సాహికులు, నగర వాసులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండే నగర వాసులు ఎం.జి.రోడ్డులోని డి అడ్రస్ మాల్‌కు చేరుకున్నారు. కోవిడ్ తరువాత పూర్తిస్థాయిలో మారథాన్‌ను నిర్వహించడంతో కళాశాల యువత, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రన్‌లో పాల్గొన్నారు. తొలుత రన్‌ను ఎం.జి.రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద జిల్లా కలెక్టర్ డిల్లీరావు, గుంటూరు రేంజ్ డిఐ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నడక అలవాటు చేసుకోవాలని దీని వలన మంచి ఆరోగ్యం వస్తుందన్నారు. గుంటూరు రేంజ్ డిఐజి డాక్టర్ త్రివిక్రమ్ వర్మ మారథానలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు మణిదీపక్, కృష్ణతేజ మాట్లాడుతూ విజయవాడ మారథాన్‌కు పెద్ద ఎత్తున స్పందన లభించిందని సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. 21, 10, 5 మీటర్ల పరుగు నిర్వహించామని విజేతలకు నగదు బహుమతితో పాటు మెడల్, టీషర్టు అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో శ్రీరామ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ సర్పరాయ చౌదరి, రేస్ డైరెక్టర్లు నాగేశ్వరరావు, పార్థు పాల్గొన్నారు. ఈసందర్భంగా విజేతల వివరాలను తెలియచేశారు.
21 కిలోమీటర్ల పరుగు : పురుషుల విభాగంలో రమావత్ రమేష్ చంద్ర, తాటిపర్తి బ్రహ్మారెడ్డి, విశాల్ అభిషేక్ దురియా వరుసగా ఫ్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో నవ్య వడ్డే, కమల కునాల, సునీత పుచ్చా వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు.
10కిలోమీటర్ల పరుగు : మహిళల విభాగంలో యుతిక, ఫలక్ ఖాన్, లక్ష్మి శ్రీ వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించగా, పురుషుల విభాగంలో బి.రమేష్, రమేష్ వంతల, పవన్ కళ్యాణ్ నాయక్‌లుమొదటి మూడు స్థానాలు సాధించారు.










