Feb 17,2023 23:11

ప్రజాశక్తి-విజయవాడ: అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో విజయవాడ నగరపాలక సంస్థ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌ స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే మీట్‌ను రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజ, వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ గాలిలోకి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ ఆట-పాట కార్యక్రమం ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నడుమ వివిధ రకాల క్రీడల పోటీలను ఏర్పాటు చేసేందుకు కమిషనర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. భాగ్యలక్ష్మి, దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ 18న శనివారం క్రికెట్‌ ఫైనల్‌, కబడ్డీ, టెన్నీ కాయిట్‌, వాలీబాల్‌, త్రోబాల్‌ వంటి పోటీలతో పాటు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గేయాల పోటీలు జరుగుతాయన్నారు. 19 ఆదివారం సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పది టీమ్‌లుగా నిర్వహించిన మార్చ్‌ ఫాస్ట్‌ ఏంతో ఆకర్షణీయంగా నిలిచింది. తొలి రోజు జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో పది టీమ్‌లు తలపడగా కమిషనర్‌ టీమ్‌, యుసిడి విభాగం టీమ్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి.