Jul 31,2023 21:34

సైకిల్‌యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
    ఎస్‌.కోట వసతిగృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
 ఎస్‌.కోట వసతిగృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-కొత్తవలస :  జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చేపట్టిన 'విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర' సోమవారం కొత్తవలసలో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ.వెంకట్శ్వేరరావు జెండా ఊపి ఈ సైకిల్‌యాత్రను రెవెన్యూ కార్యాలయం జంక్షన్‌ వద్ద ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్‌జంక్షన్‌కు చేరుకుంది. సైకిల్‌యాత్రకు విద్యార్థులు అడుగడుగునా స్వాగతం పలికారు. కొత్తవలసనుంచి ప్రారంభమైన యాత్ర లక్కవరపుకోట మీదుగా ఎస్‌.కోట చేరుకుంది. సైకిల్‌ యాత్ర ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక పక్క పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తున్నారని, సంక్షేమ హాస్టళ్లలో పూర్తిగా విద్యార్థులకు మౌలిక సదుపాయలు లేక, మెస్‌ ఛార్జీలు పెరగక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కెజిబివిల్లో ఇప్పటికీ సరిగ్గా టీచర్లు లేరని అన్నారు. విద్యార్థులు పోరాటాల ద్వారానే తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తమ సొంత జిల్లాలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నేటి వరకు అందించలేదని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు సరైన బిల్డింగులు లేవన్నారు. జీవో 77 తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ జిల్లాలో మూత పడిన పరిశ్రమలు తెరిపించడంలోను, కొత్తవి స్థాపించండంలోను, ఉపాధి కల్పించడంలోను పాలకులు విఫలమయ్యారని అన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించా లని జిల్లా వ్యాప్తంగా 400 కిలోమీటర్లు సైకిల్‌యాత్ర చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్‌ పావని, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌, నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు. సైకిల్‌యాత్రకు సిఐటియుజిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు మద్దతు తెలిపారు. అనంతరం కొత్తవలసలోని కెజిబివి పాఠశాలను ఎమ్మెల్సీ సందర్శించారు. ఉపాధ్యాయినులతో మాట్లాడిసమస్యలు తెలుసుకున్నారు.

కెజిబివి టీచర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు
కెజిబివి టీచర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు


జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలి
లక్కవరపుకోట : మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ డిమాండ్‌ చేశారు. లక్కవరపుకోట చేరుకున్న సైకిల్‌యాత్ర తొలుత ఎపి మోడల్‌ స్కూల్‌ను నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకుని రెండు నెలలు కావస్తున్న నేటికీ చాలామందికి పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఆర్భాటంగా చెప్పుకుంటున్న అమ్మబడి పథకం ద్వారా ఇవ్వవలసిన డబ్బులు అనేకమంది తల్లులకు అందలేదన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
నేడు ఎస్‌. కోటలో బహిరంగ సభ
శృంగవరపుకోట : పట్టణంలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ తెలిపారు. ఎస్‌.కోటకు చేరుకున్న సైకిల్‌ యాత్రకు ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. దేవి కూడలిలో విద్యార్థులు వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఉదయం 10 గంటలకు దేవి బొమ్మ కూడలిలో జరిగే బహిరంగ సభకు విద్యార్థులు తరలిరావాలని రామ్మోహన్‌ కోరారు.