ప్రజాశక్తి -యంత్రాంగం సమ్మర్ స్పోర్ట్‌లో భాగంగా పలుచోట్ల నిర్వహిస్తున్న క్రీడలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కరప మండలం వేళంగిలో జెడ్‌పి ఉన్నత పాఠశాల మైదానంలో వేళంగి గ్రాడ్యుయేట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. శీల, వాకాడ-2 మధ్య జరిగిన మ్యాచ్‌లో శీల టీం విజయం సాధించింది. అండర్ 19 మ్యాచ్‌లు వర్షం కారణంగా వాయిదా వేసినట్లు నిర్వహకులు నక్కెళ్ల వేణుగోపాల్, షేక్ లాలిబాబు, అప్పికొండ దుర్గాప్రసాద్, వై.విక్రమ్, చప్పిడి మూర్తి, చేగొడి సూర్య, జాజి, అఖిల్ తెలిపారు. తాళ్లరేవు కోరంగి పంచాయతీ చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో సామాజిక కార్యకర్త కర్రి నూకరాజు నిర్వహించిన కెఎన్‌ఆర్ వాలీబాల్ టోర్నీలో జి.వేమవరం జట్టు విజేతగా నిలిచింది. 12 జట్లు పాల్గొన్న ఈ పోటీలల్లో జి.వేమవరం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా పెదవలసల జట్టు ద్వితీయ స్థానాన్ని, చినవలసల జట్టు తృతీయ స్థానాన్ని గెలుచుకుంది. ఈ పోటీలను చూడడానికి మండలంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు వాలీబాల్, నెట్‌లను కర్రి నూకరాజు అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్లు రేకాడి దుర్గాప్రసాద్, మహాలక్ష్మి, దోమ దుర్గాప్రసాద్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పిఠాపురం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రగ్బీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళ పురుషుల రెండో రోజు రగ్బీ పోటీలను మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్ వర్మ తనయుడు గిరీష్ కుమార్ ప్రారంభించారు. ఆదివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు జరిగాయి. పురుషుల విభాగంలో తూర్పు గోదావరి, నెల్లూరు జట్లు, మహిళా విభాగంలో విజయనగరం, నెల్లూరు జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నట్టు ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బి అసోషియేషన్ అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్, షైన్ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఎపి ఫెన్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగం సతీష్ బాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.పద్మనాభం, ఎపి రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి బి.రామాంజనేయులు, సతీష్, వంశీ, సాయి, అఖిల్ పాల్గొన్నారు.










