ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల శనివారం సిపిఎం సమరభేరి ప్రచారం సందర్భంగా ప్రజలు పలు సమస్యలను వివరించారు. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ జి.ప్లస్ ఒన్ సముదాయంలో సిపిఎం సమరభేరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పారిశుధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు సామాన్యులు నివశించే ప్రాంతాల్లో సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం నగర నాయకులు కె.సత్తిరాజు, దుంపల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని సిపిఎం బృందం అధికారుల దృష్టికి తీసుకెళుతుందన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా 4వ తేదీ ఉదయం కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నాయకులు మలకా వెంకట రమణ, వేణు, సూరిబాబు, నాగలక్ష్మి, ఆదర్శ్, జయరాం, జివివి, సత్యవాణి పాల్గొన్నారు. పిఠాపురం సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా విరవాడ గ్రామంలో సిపిఎం నాయకులు కార్య కర్తలు కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె.సింహాచలం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రతి నెలా అదనపు భారం మోపుతున్నారన్నారు. మోడీ 2104లో ఎన్నికల హామీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి 50 లక్షల ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రుద్రవరపు భూలోకం, రాగం సత్తిరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పల్లి భూషణం, కొత్తపల్లి నాగేశ్వరరావు, ఆర్.బంగారం, కండెలి కుమారి, వడ్డి సత్తులు పాల్గొన్నారు.










