ప్రజాశక్తి- ఉక్కునగరం : ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు నాందిగా ఉక్కునగరం తృష్ణ గ్రౌండ్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ ఎస్‌సి.పాండే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ''ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులను చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ, ప్రాముఖ్యతపై కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇతరులను చైతన్యపరచడానికి నిరంతరంకట్టుబడి ఉండానని సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. వచ్చేనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్టీల్‌ప్లాంట్ పర్యావరణ నిర్వహణ విభాగాన్ని అభినందించారు. సహజ వనరులు, పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం కాపాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. తృష్ణ మైదానం నుంచి, ఉక్కునగరం టౌన్‌షిప్‌లోని వివిధ సెక్టార్‌ల మీదుగా సాగిన ఐదు కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో పిల్లలు, యువకులు, పర్యావరణ నిర్వహణ విభాగం సీనియర్ అధికారులు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సైకిల్ ర్యాలీ పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలను ఉక్కు పర్యావరణ నిర్వహణ విభాగం ఇన్‌ఛార్జి, విభాగాధిపతి జి. ఫణికుమార్ అందించారు.










