
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రంధాలయ అధికారి జనార్ధన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్ జోగేశ్వరరావు ముందుగా పేపర్ క్రాఫ్ట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు పేపర్‌తో తయారు చేసిన పుష్పగుచ్చం, ఫోటో ఫ్రేమ్, పువ్వులు స్టాండ్ కళాకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముగింపు కార్యక్రమం లో బహుమతులు అందజేయనున్నట్లు గ్రంథాలయ అధికారి జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అప్పలరాజు, సచివాలయ వార్డు కార్యదర్శి నూకరాజు, సిబ్బంది రమణమ్మ పాల్గొన్నారు.
ములగాడ : విద్యార్థులు సామాజిక చైతన్య విషయాలపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా కళారూపాలుగా వాటిని తయారుచేసి ప్రదర్శించాలని జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి సూచించారు. మల్కాపురంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరంలో శనివారం ఆమె మాట్లాడుతూ, స్వచ్ఛభారత్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంచి అలవాట్లు, ఆరోగ్యవంతమైన జీవన విధానం, అక్షరాస్యత ఆవశ్యకత తదితర అనేక అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రముఖ కవి కె.సత్తిరాజు మాట్లాడుతూ, కులమతాలకతీతంగా వెళ్లే ఆలయం గ్రంథాలయమన్నారు. పాత్రికేయులు మనోహర్ మాట్లాడారు. కార్పొరేటర్ కొణతాల సుధ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. గ్రంథాలయాధికారి వి.అజరు కుమార్ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.