ప్రజాశక్తి-కోటవురట్ల:సంక్రాంతి సంబరాల్లో భాగంగా మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బికే పల్లి గ్రామంలో సర్పంచ్ లింగన్న నాయుడు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వెంకటాపురం గ్రామంలో బీసీ సెల్ అధ్యక్షులు పైల రమేష్, గ్రామ సర్పంచ్ ఇందిరా భవాని భోగి పండుగ సందర్భంగా హరిదాసుతో కలిసి కీర్తనలు ఆలపించారు. తంగేడు, కైలాస పట్నం గ్రామాల్లో భోగి పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గొలుగొండ:మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం వాలీబాల్ పోటీలను గొలుగొండ ఎస్సై నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత పండుగల నేపధ్యంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ కసిపల్లి అప్పారావు పాల్గొన్నారు.










