Apr 14,2023 23:27

ప్రజాశక్తి - ఉంగుటూరు
               గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నామని శ్రీలక్ష్మీనారాయణ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, జనసేన పార్టీ ఉంగుటూరు నియోజవర్గ బాధ్యులు పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఉంగుటూరులో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల్పించారు. అనంతరం క్రికెట్‌ టోర్నమెంటు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో నాలుగు మండలాల నుంచి 39 టీములు పాల్గొంటాయి. మొదటి లీగ్‌ మ్యాచ్‌లను రోజుకు నాలుగు చొప్పున నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు 18న సాయంత్రానికి ముగుస్తాయని, అనంతరం లీగ్‌ మ్యాచ్‌ నుంచి విజయం సాధించిన జట్టుకు మరోసారి డ్రా తీస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఫైనల్‌ పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నారాయణపురం గ్రామ సర్పంచి దిడ్ల అనకనందదేవి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఉప్పాకపాడు ఎంపిటిసి సభ్యులు ఇంటి మంగరాజు, అడవికొలను ఎంపిటిసి సభ్యులు నిమ్మల దొరబాబు, కృష్ణంరాజు, చింతలపాటి బాసిరాజు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్టుకు రూ.50 వేలు, ద్వితీయ స్థానం జట్టుకు రూ.25 వేలు, తృతీయ స్థానం జట్టుకు రూ.15 వేలు, అలాగే ఉత్తమ బ్యాట్స్‌మెన్‌, ఉత్తమ బౌలర్‌కు కూడా నగదు బహుమతులను లక్ష్మీనారాయణ ట్రస్ట్‌ అందించనున్నారు.