
ప్రజాశక్తి- వడ్డాది, చోడవరం
జిల్లాలోని నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజనుల సమస్యలపై 5వ షెడ్యూల్ సాధన సమితి, అఖిలభారత ఆదివాసీ సంఘం ఆధ్వర్యాన ఈ నెల 4 నర్సీపట్నంలో ప్రారంభమైన పాదయాత్ర ఉత్సాహకంగా సాగుతోంది. మూడో రోజు పాదయాత్ర ఆదివారం ఉదయం వడ్డాది నుండి ప్రారంభమై చోడవరం మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎపి ఆదివాసీ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నల్లి కళ్యాణం మాట్లాడుతూ ఐటిడిఎను అల్లూరి జిల్లాలో కలిపి వేయడంతో అనకాపల్లి జిల్లాలోని నాన్ షెడ్యుల్డ్ ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిల్లాలోని ఆదివాసీల భూములను కాజేయడానికి అవినీతిపరులైన కొందరు రెవెన్యూ అధికారుల సహకారం, కొందరు పోలీసు అధికారుల మద్దతుతో పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎపి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు, ఎంపీ రాందేవ్ మాట్లాడుతూ ఐటీడీఏ ఏర్పడినప్పుడు బైలాలో రాసిన భౌగోళిక ప్రాంతం మారలేదని, అందువల్ల అనకాపల్లి జిల్లాలోని మైదాన గిరిజనులకు ఐటీడీఏ సేవలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి పిఎస్.అజరు కుమార్ మాట్లాడుతూ నాన్ షెడ్యూల్ ఆదివాసీల భూమి సమస్యలపై బాధిత గిరిజనులు, స్థానిక అధికారులతో జిల్లా కలెక్టర్ ముఖముఖి సమీక్ష సమావేశాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బుగతా జంగారావు, ఎస్.గణేష్, లోకం భాస్కరరావు, వాకపల్లి రాజబాబు, గోరా దేవి, మోసురి రాజు, చిన్నారావు, కోట కొండలరావు, గోరా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.