
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : బాలల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి చలనచిత్రోత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రముఖ సినీ గీత రచయిత, దర్శకుడు డాడీ శ్రీనివాస్ అన్నారు. తెనాలి కల్చరల్ ఫిలిమ్స్ సొసైటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని వివేకానందా సెంట్రల్ స్కూల్ ఆవరణలో మూడ్రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రం గురువారం ముగిశాయి. ముగింపు సభకు వివేకా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రాయపాటి వీరనారాయణరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు జరపాల్సిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను తెనాలిలో ఏటా జరుగుతున్న సొసైటీని అభినందించారు. చిత్రోత్సవాలు ప్రతిభ కలిగిన వారికి ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. బాలల చిత్రాలకు ప్రభుత్వాలు ప్రకటించిన సబ్సిడీని మొత్తాన్ని సకాలంలో జమ చేసినట్లయితే నిర్మాత దర్శకులు మరిన్ని మంచి చిత్రాలను తీసేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. తాను తీసిన బాలల చిత్రం 'మట్టిలో మాణిక్యాలు'కు ద్వితీయ ఉత్తమ బాలల చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అవార్డు పొందిందన్నారు. ఆ సినిమాకి ఉగాది ఎక్సలెన్స్ జాతీయస్థాయి అంబేద్కర్ అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పటికీ తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు ప్రకటించిన సబ్సిడీ జమ చేయలేదని తెలిపారు. ప్రతిభ కనబర్చిన కళాకారుడు ఎప్పటికైనా తన ప్రతిభను నిరూపించుకుంటాడని చెప్పేందుకు తానే నిదర్శనమని, అనేక కష్టాలను అనుభవిస్తూ సినీ రంగంలో పాటల రచయితగా నిలదొక్కుకొని ఇప్పటికీ 396 సినిమాల్లో 800 పైగా పాటలు రాశానని చెప్పారు. బింబిసారాలో నటించిన బాలనాటి శ్రీదేవి, భగవత్ కేసరి సినిమా బాల నటుడు పుష్కర్, టీవీ, సినిమా, వెబ్ సిరీస్‌లో నటిస్తున్న బాలనాటి భవ్యశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరికి సర్టిఫికెట్లను జ్ఞాపకలను బహూకరించారు. వివిధ సినిమాల్లో వీరు నటించిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు, వివేకానంద సెంట్రల్ స్కూల్ సిఇఒ రావిపాటి వెంకటరావు, ఏవో సత్య ప్రసాద్, చిల్ట్రన్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కష్ణ పాల్గొన్నారు.