Jul 29,2023 23:52

సదస్సులో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రియాంక

ప్రజాశక్తి-యంత్రాంగం
మహిళలపై హింస నివారణకు నిపుణులతో అధ్యయన కమిషన్‌ ఏర్పాటు చేయాలని, మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో తలపెట్టిన హింసపై మహిళల పోరు యాత్ర రాష్ట్ర జాతా రెండో రోజైన శనివారం విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలో ప్రారంభమైంది. అనంతరం ఆనందపురం మండలానికి చేరుకుని అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాలను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ రోజురోజుకూ మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పలు అంశాలపై మహిళలను చైతన్యం చేయడానికే ఈ యాత్ర చేపట్టామని తెలిపారు.
కలెక్టరేట్‌ : మహిళల పోరుయాత్రలో భాగంగా విశాఖ ఉమెన్స్‌ కాలేజీలో జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ జి.ప్రియాంక, కంచరపాలెం చాణిక్య డిగ్రీ కాలేజీలో జరిగిన సదస్సులో విసిసి వ్యవస్థాపకులు డాక్టర్‌ కె.రమాప్రభ మాట్లాడారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి, నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని, పోర్న్‌ వెబ్‌ సైట్లను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలని కోరారు. కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటుచేసి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, విశాఖ జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, అధ్యక్షులు బి.పద్మ, నాయకులు రమణి, ఆర్‌.వరలక్ష్మి, కె.మణి, బి.భారతి, డి.కొండమ్మ, ఎ.పుష్ప, బొట్టా ఈశ్వరమ్మ, ఎస్‌.విజయలక్ష్మి, బి.అనంతలక్ష్మి పాల్గొన్నారు. జాతాకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, వర్కింగ్‌ విమెన్‌ కో -ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.కామేశ్వరి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌, అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు, ప్రజానాట్యమండలి కార్యదర్శి ఎం.చంటి మద్దతు తెలియజేశారు. కంచరపాలెం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఐద్వా జోన్‌ అధ్యక్షులు కె.అనురాధ ఎం.జయలక్ష్మి, కె.హేమలత పాల్గొన్నారు.
పెందుర్తి : పెందుర్తిలో ఐద్వా ఆధ్వర్యాన మహిళల పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలను చైతన్యపరిచేందుకే జాతా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ప్రియాంక, సిహెచ్‌ రమణి, పూర్ణిమ, జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, అధ్యక్షులు పద్మ, నాయకులు అనంతలక్ష్మి, రమణి తదితరులు పాల్గొన్నారు
ఆనందపురం : ఆనందపురం పూల మార్కెట్‌ వద్ద ప్రచార జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ, మహిళపై హింసను అరికట్టాలని, మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ ఆగస్టు 8వ తేదీన విజయవాడలో చేపట్టే బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు జానపద గేయాలు, మహిళలపై జరుగు హింసపై పాటల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, పూర్ణ, రమణి, పూర్ణిమ, కె.నాగరాణి, జానపద కళ కారులు, మహిళలు పాల్గొన్నారు.