Oct 22,2022 23:55

ఆనందపురంలో అర్హత సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -యంత్రాంగం
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న క్రీడాపోటీలకు సంబంధించి మండల స్థాయిలో క్రీడా జట్ల ఎంపిక ప్రారంభమైంది. పలు పాఠశాలల్లో పోటీలు నిర్వహించారు.
భీమునిపట్నం : మండల స్థాయిలో క్రీడా జట్ల ఎంపిక ప్రక్రియ స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైంది. 14 నుంచి 17 ఏళ్ల లోపు బాల, బాలికలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. త్రోబాల్‌, వాలీబాల్‌, యోగా,టెన్నీకాయిట్‌, బ్యాడ్మింటన్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. స్థానిక పిఎన్‌ఎం జివిఎంసి ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి వై.సాయిచంద్‌ వాలీబాల్‌ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల శ్రీదేవి శనివారం తెలిపారు. 9వ తరగతి విద్యార్థి ధనుష్‌ 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పోటీల్లో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు పాఠశాలలో అభినందించారు.
పద్మనాభం: పద్మనాభం మండలంలోని పలు పాఠశాలల నుంచి 9 రకాల అటల పోటీల్లో 170 మంది గెలుపొంది నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఆనందపురం : ఆనందపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరిగిన క్రీడలలో 90 మంది విద్యార్థులు వివిధ పోటీలలో అర్హత సాధించారు. వివిధ పాఠశాలల నుంచి 14 నుంచి 17 వయసుగల విద్యార్థులు సుమారు 350 మంది కబాడీ వాలీబాల్‌, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, త్రోబాల్‌ పోటీల్లో పోటీపడ్డారు. 90 మంది నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు ఈ నెల 26న చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో జరుగు నియోజకవర్గ స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆనందపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు ఫిజికల్‌ డైరెక్టర్‌ యు.మాలతి తెలిపారు.