Jul 17,2023 22:39

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి చెస్‌ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. జిల్లా స్థాయి పోటీలతో పాటు జిల్లా జట్లు ఎంపికల కోసం ఈ పోటీలను నిర్వహించినట్లు కృష్ణా జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం.ఎన్‌.ఫణికుమార్‌ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఆరు రౌండ్లు పోటీలను నిర్వహించినట్లు తెలియచేశారు. వీరిలో నలుగురిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కె.సందీప్‌ 6 పాయింట్లకు 5.5 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం సాధించగా, వి.కిషన్‌, ఇ.లలిత్‌ కౌషిక్‌, బి.నాగచౌతన్య ఐదు పాయింట్లు సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ఈనలుగురు క్రీడాకారులు ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సమావేశంలో గన్నవరం చెస్‌ మేనేజర్‌ కె.ఆనంద్‌, కృష్ణాజిల్లా చెస్‌ మేనేజర్‌ జి.రామకృష్ణ, కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ అబ్థుల్‌ గఫార్‌ పాల్గొని విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందచేశారని తెలిపారు.