అట్టహాసంగా వ్యకాస రాష్ట్ర మహాసభ ప్రారంభం
మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ వరకూ భారీ ప్రదర్శన
వేలాది మంది జనం నినాదాలతో మార్మోగిన జంగారెడ్డిగూడెం
నేతల ప్రసంగాలతో సభికుల్లో నూతనోత్సాహం
జగన్, చంద్రబాబు పేదల భూములపై నోరుమెదపరు
జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్
మోడీ ఆదేశిస్తే జగన్ అమలు
జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం
వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ గురువారం ఏజెన్సీ ముఖద్వారం జంగారెడ్డిగూడెంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ వరకూ భారీ ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనలో గిరిజనోద్యమ నేత జాతీయ నాయకురాలు బృందాకరత్, వ్యవసాయ కార్మికసంఘం ఆఖిల భారత అధ్యక్షులు ఎ.విజయరాఘవన్, జాతీయ కార్యదర్శి బి.వెంకట్, రూరళ వ్యవసాయ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ చందన్, పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, ఆహ్వన సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రవి, వ్యకాస జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్, వ్యకాస నేతలు తామా ముత్యాలమ్మ, ఎం.జీవరత్నం, గిరిజన సంఘం జిల్లా నేత తెల్లం రామకృష్ణష్ణతోపాటు, పలవురు నేతలు, వేలాది మంది జనం పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో అంతా ఎర్రజెండాలు చేతబూనడంతో జంగారెడ్డిగూడెం ప్రాంతమంతా అరుణారుణమైంది. వేలాది మంది నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. బస్టాండ్ సమీపంలో కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్మారక ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది వ్యవసాయ కూలీలు, గిరిజనులు విచ్చేశారు. తొలుత నెల్లూరు జిల్లా అలగానిపాడు నుంచి తీసుకొచ్చిన అమరవీరుల జ్యోతిని బృందాకరత్‌కు, ఎర్రకాల్వ మిగులు భూముల పోరాట నేతలు తీసుకొచ్చిన జ్యోతిని విజయ రాఘవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్త బృందాకరత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, వ్యవసాయ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్ మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి అని, జగన్ మూడు రాజధానులు అని అనడం తప్ప పేదల భూముల గురించి ఇరువురు మాట్లాడరని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే పేదల జీవితాలు దుర్బరంగా మారు తున్నాయని, భూములు లేని పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. దేశంలో 60 శాతం జనాభాకు భూమి లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి భూమిచ్చేందుకు సహకరిం చడం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తోందన్నారు. రైతులు, కార్మికులు అంతా కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.
ఎరుపెక్కిన పోరాటాల పురిటిగడ్డ జంగారెడ్డిగూడెం
పోరాటాల పురిటి గడ్డ, ఏజెన్సీ ముఖ ద్వారం జంగారెడ్డిగూడెం ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ ర్యాలీ మహాప్రదర్శనలో వ్యవసాయ కార్మికులు భూమి పంచాలి, కూలి పెంచాలి నినాదాలతో కదం తొక్కారు. ప్రదర్శనలొ ముందు భాగాన గిరిజన సాంస్కతిక నత్యాలైన రేల డాన్సులు, డోలు వాయిద్యాలు, డప్పుల దరువులు, జానపద నత్యాలతో ప్రదర్శన ఉత్సాహభరితంగా సాగింది. అలాగే మతసామరస్యం చాటుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్ వేషధారణలు, వ్యవసాయ పనిముట్ల, కూలీల వేషధారణలతో అలరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ట్రాక్టర్ పై ఏర్పాటు చేసిన భలే మంచి చౌక బేరం శకటాలు వ్యంగ్య అస్త్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాష్టవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలొచ్చిన వ్యవసాయ కార్మికులు ఎర్రజెండాలు చేత పట్టి పెరిగేధరలకు హద్దు లేదు ఏలే వాడికి బుద్ధి లేదు, పేదలకు భూములు పంచేవరకు పోరాడుతాం, దున్నే వానికి వారికి భూమి పంచాలి, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, పని దినాలు 200 రోజులకు పెంచాలి, కనీస వేతనం 600 ఇవ్వాలి, జగనన్న నవరత్నాల్లో భూపంపిణీ చేర్చాలి, కేరళ తరహాలో నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి, మతం పేరుతో మారణ హోమం చేయొద్దు, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది.
అడవిని కార్పొరేట్లకు కట్టబెడుతున్న పాలకులు
గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు
కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బిజెపికి వైసిపి ఎంపీలు వంతపాడుతూ ఆదివాసీల అడవిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం భూమి పంచాలని పోరాడుతున్న జానపద గీతం పాడుతూ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
మోడీ ఆదేశిస్తే జగన్ అమలు
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ మోడీ ఆదేశిస్తే జగన్ ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ఎపి, తెలంగాణాల్లో బిజెపిని ఓడించేందుకు ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. ఏజెన్సీలో భూములను అదానికీ అప్పగిస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో పోరాటం సాగించాలన్నారు. పెన్షన్, పెళ్లికానుక ఇస్తే జీవితాలు మారవని, భూములు గురించి మాట్లాడాలని అన్నారు. 15 ఏళ్ల క్రితం 250 ఉన్న డిఎపి బస్తా ధర ఇప్పుడెంత అని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో చూడాలన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే జగన్‌కూ పడుతుందన్నారు. జంగారెడ్డిగూడెంలో బిజెపి, కాంగ్రెస్, టిడిపి ఏఒక్కరూ పోరాటాలు చేయలేదని, ఎర్రకాల్వ భూములు 11 వందల ఎకరాలను సంఘం ఆధ్వర్యాన సాగు చేయిస్తున్నామని తెలిపారు. ఓట్లు, సీట్లు రావొచ్చు, పోవొచ్చని, నిర్వాసితులకు ఎర్ర జెండా అండగా నిలుస్తుందన్నారు.
కార్మికులకు ఎర్రజెండా అండ
ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎస్‌కె.సాబ్జీ
సంపద సృష్టించేది కార్మికులైతే దోచుకునేది పాలకులు అని ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. 18 వేల కోట్ల ఆస్తిపరుడైన అదానికి మోడీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు కార్మిక సంపదను దోచిపెట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో మాధవరం, బెస్తగూడెం, ఎల్లప్పగుడెం, కౌంఠిన్యముక్తి గ్రామాలను చేర్చాలన్నారు. ఈ గ్రామాల్లో తొమ్మిది అడుగుల లోతు వరద నీరు ప్రవహించిందన్నారు. నేడు రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పేదల సమస్యలపై హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు.
బృందా కరత్‌కు ముస్లిం మహిళల సన్మానం
మాజీ ఎంపీ, గిరిజనోద్యమ జాతీయ నాయకురాలు బృందాకరత్‌ను స్థానిక ముస్లిం మహిళలు శాలువాతో ఘనంగా సన్మానించారు. బహిరంగ సభ వేదికపై బందాకరత్‌ను పట్టణ ముస్లిం సోదరులు, సోదరీమణులు కలిసి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిములు, క్రైస్తవులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. దాడులు జరిగిన ప్రతిసారీ ఎర్రజెండా సోదరులు మైనార్టీ సోదరులకు అండగా నిలిచారన్నారు. ఎర్రజెండా సోదరుల అండదండలు ఉండబట్టే భారతదేశంలో ముస్లిం క్రైస్తవులు ధైర్యంగా బతకగలుగుతున్నారన్నారు. ఎన్‌అర్‌సి, సిఎఎ, హిజాబ్ వంటి ప్రతి విషయంలోనూ ఎర్రజెండా సోదరులు అండగా నిలబడుతున్నారన్నారు. ఢిల్లీలో బుల్డోజర్లతో ముస్లింల ఇళ్లు కూలుస్తున్నప్పుడు బందాకరత్ ధైర్యంగా బుల్లోడోజర్లకు ఎదురు నిలిచి ఇల్లు కూల్చివేతను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బందాకరత్‌కు ముస్లిం మహిళలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
పేదలకు భూ పంపిణీ చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
పేదలకు భూపంపిణీ చేస్తేనే పేదరికం నిర్మూలించబడుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. 1946-51 వరకు తెలంగాణలో మూడు వేల గ్రామాల్లో 10 లక్షల మందికి భూములు పంచిన చరిత్ర ఎర్ర జెండాకు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 195 సంఘాలను ఐక్యం చేసిన భూపోరాటంలో ఏడుగురు అమరులై భూములు సాధించుకున్నామన్నారు. 2023 జనవరి తరువాత పేదల భూములను స్వాధీనం చేసుకున్న భూస్వాముల నుండి ఎర్రజెండా సాక్షిగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందన్నారు. బిజెపిని లేకుండా చేయడానికీ కార్మికులు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు.










