రెండు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకయ్యే ఖర్చుతో 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేయవచ్చు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఒక్క ఏడాది ఆపితే చేతిలో మిగిలే రూ.10,000 కోట్లతో 300 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పొందవచ్చు. పోనీ, ఆ రెండూ వాయిదా వేయకపోయినా, బడ్జెట్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ల కోసం కేటాయించిన రూ.35000 కోట్లలో మూడో వంతు ఖర్చు చేసినా దేశానికి, ప్రపంచానికి కూడా సరిపడా వ్యాక్సిన్ ను అందించి వుండే వాళ్ళం.
స్వాతంత్య్రోద్యమం నుండి స్వావలంబన అన్న భావన మొదట పుట్టుకొచ్చింది. మన ప్రజల, సంస్థల, దేశీయ పరిశ్రమల సామర్ధ్యాన్ని పెంపొందించి ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుండి విడిపించుకోవడం ఆ స్వావలంబన అర్ధం, లక్ష్యం. ఇక రెండోసారి స్వావలంబన గురించి మాట్లాడింది మోడీ. ఆయన 'ఆత్మనిర్భర భారత్' అని ఇచ్చిన నినాదం అర్ధం కేవలం స్థానికంగా ఉత్పత్తి చేయాలన్నది మాత్రమే. స్వావలంబనను పూర్తి అర్ధంలో పెంపొందించడంలో విఫలమై నందువల్లనే నేడు మన ప్రజలకి అత్యవసరంగా కావలసిన వ్యాక్సిన్ లను కూడా అందించడంలో విఫలమైనాం.
మొదటి తరహా స్వావలంబన బహుళజాతి గుత్త కంపెనీల ఆధిపత్యాన్ని బద్దలుకొట్టింది. మన దేశానికి జెనరిక్ ఫార్మస్యూటికల్ పరిశ్రమని ఇచ్చింది. అంతర్జాతీయంగానే పేదలకు ఔషధాలను అందించే కేంద్రంగా మన దేశాన్ని నిలబెట్టింది. 1970 పేటెంట్ చట్టం ఆధారంగా మన సిఎస్‌ఐఆర్ ల్యాబ్స్ విదేశాలలో కనిపెట్టిన ఔషధాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఔషధాల ఉత్పత్తి సాగించాయి. ఆ విధంగా మన దేశంలో ప్రభుత్వ రంగం లోను, ప్రైవేటు రంగంలో కూడా ఔషధ కంపెనీలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే మన దేశం ప్రపంచం లోకెల్లా అతి పెద్ద జెనరిక్ ఔషధాల ఉత్పత్తిదారు గాను, వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగాను ఎదిగింది.
మోడీ ఆత్మనిర్భర భారత్ ఆ సామర్ధ్యాన్ని అంతటినీ ఉపయోగించుకునే అవకాశాలను జారవిడుచుకుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌లను అందించడానికి ఏర్పాటు చేసిన వేదిక కోవ్యాక్స్. ఆ కోవ్యాక్స్‌కు వ్యాక్సిన్ లను సరఫరా చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. కాని ఇక్కడ మన దేశంలో కోవిడ్ ఉధృత రూపం దాల్చడంతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆ ఒప్పందాన్ని పాటించలేకపోతోంది. డబ్ల్యుహెచ్‌వో కు జూన్ కల్లా అందించాల్సి వ్యాక్సిన్ డోసుల్లో 18 కోట్ల డోసులు సప్లై చేయలేని స్థితిలో ఉంది. అదే డిసెంబర్ మాసాంతానికి మరో 20 కోట్ల డోసుల కొరవ ఉండబోతోంది. డబ్ల్యుహెచ్‌వో పై ఆధారపడిన అనేక దేశాల పాలిట ఇది వినాశకరంగా మారనుంది.
మన దేశపు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కోవిడ్ నేపథ్యంలో మరింత బలోపేతం చేసే బదులు, 'మోడీ ఆత్మనిర్భరత' ఉన్న సామర్ధ్యాన్ని దెబ్బ తీసింది. గ్లోబల్ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం పనికిరాదని తేల్చింది.
మోడీ భజన బృందం తప్ప తక్కిన శాస్త్రవేత్తలంతా కరోనా రెండో తాకిడి గురించి ముందే హెచ్చరించారు. శరవేగంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుకోవలసిన అవసరం అందరికీ అర్ధం అయింది. కాని, ఆ పని చేయకుండా, మోడీ ప్రభుత్వం కోవిడ్-19 పైన విజయం సాధించేశామని ప్రకటించేసింది. ఇక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించడమే మిగిలిందన్నట్టు ఎన్నికల యుద్ధంలో మునిగిపోయింది.
ఏం చేసి వుండాల్సింది ?
కోవిడ్-19 తొలి తాకిడి ఉధృతి తగ్గాక, రెండవ తాకిడి మొదలవడానికి ముందు దాదాపు అయిదు నెలల వ్యవధి ఉంది. ఆ కాలంలో కోవిడ్ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ వ్యవధిలో ఆస్పత్రులను నిర్మించుకోవడం, ఆక్సిజన్ తదితర వైద్య అవసరాలను సిద్ధం చేసుకోవడం, వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడం చేసి వుండొచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల కంపెనీలు మన దేశంలో దాదాపు 50 దాకా ఉన్నాయి. సరైన ప్రణాళికతో, ప్రభుత్వ తోడ్పాటుతో ముందుకెళ్ళి వుంటే, ఈ పాటికి దేశ ప్రజలకు అందరికీ వ్యాక్సిన్ అందించడమే కాకుండా ప్రపంచం లోని ఇతర దేశాల అవసరాలను కూడా తీర్చగలిగే స్థితిలో మన దేశం ఉండేది.
ఇప్పటికే ప్రపంచంలో రెండు రకాల టెక్నాలజీలతో కోవిడ్ వ్యాక్సిన్ లు తయారు చేస్తున్నారు. మన ఐసిఎంఆర్ రూపొందించి భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్సిన్, చైనాలో ఉత్పత్తి అవుతున్న కరోనావ్యాక్, బిబిఐబిపి-కార్‌వి, వంటివి మొదటి తరహా టెక్నాలజీతో ఉత్పత్తి అవుతున్నాయి (వీటిని ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్‌లు అంటారు). ఇక రెండో తరహా వ్యాక్సిన్‌లు మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, గామాలేయా సంస్థ ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ వి, కాన్సినో ఉత్పత్తి చేస్తున్న కాన్విడిసియా వంటి వ్యాక్సిన్ లు ఉన్నాయి. వీటిని అడినో వెక్టర్ వ్యాక్సిన్ లు అంటారు.
ఇవి గాక ఇంకా కొన్ని కొత్త టెక్నాలజీలు కూడా ఉన్నాయి. వాటి విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు కనుక వాటిని పక్కన పెట్టి, మనకు ఇప్పటికే బాగా తెలిసి వున్న రెండు తరహాల టెక్నాలజీలను ఉపయోగించి వ్యాక్సిన్ ఉత్పత్తిని బాగా పెంచవచ్చు. అందుకు తగిన ఉత్పత్తి సామర్ధ్యం కూడా మనకు ఉంది.
ముంబై లోని హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ కు వందేళ్ళ చరిత్ర ఉంది. దానిని ఒక ఆధునిక బయో టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఆ సంస్థ నుండి హాఫ్‌కిన్ బయో ఫార్మస్యూటికల్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ రంగ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడి, ప్రస్తుతం ప్రపంచం లోనే పెద్దదైన వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉంది. ఇటువంటివి మొత్తం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశంలో ఉన్నాయి. కాని ప్రైవేటీకరణ విధానాలు వచ్చాక ఈ సంస్థలను క్రమంగా దెబ్బ తీయడం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వివిధ రకాల వ్యాక్సిన్‌లను ప్రైవేటు సంస్థల నుండి మాత్రమే కొనుగోలు చేయడం ఆనవాయితీ అయిపోయింది. ఏడాది క్రితం వరకూ ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యాక్సిన్ లలో 60 శాతం ఒక్క భారతదేశమే ఉత్పత్తి చేసేది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌వో) ప్రకారం మన దేశంలో 21 వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 800 కోట్ల డోసులు! ఇవి కాకుండా మరో ముప్పై బయోలాజిక్ కంపెనీలు ఉన్నాయి. వీలికి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. వీటిలో కొన్నింటితో విదేశీ సంస్థలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నాయి కూడా.
అతి పెద్ద పొరపాటు
ఇంత ఎక్కువ సామర్ధ్యం ఉండి కూడా ఇప్పుడు మన దేశంలో నెలకు కేవలం 6 నుండి 7 కోట్ల డోసుల వ్యాక్సిన్ మాత్రమే ఎందుకు ఉత్పత్తి అవుతోంది ?
కోవిడ్ ను మన దేశం ఓడించేసిందని, కాబట్టి మన ప్రజలకందరికీ వ్యాక్సిన్‌లను తీరుబాటుగా అందించవచ్చునని మోడీ ప్రభుత్వం భావించడమే అతి పెద్ద పొరపాటు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసే 7 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే కోటి డోసులు (ఒక నెలకు) మనకు పుష్కలంగా సరిపోతాయని, అందులో నుంచి ఎగుమతి కూడా చేయవచ్చునని ప్రభుత్వం అనుకుంది. 2021 మార్చి 8న జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (సైన్స్ అండ్ టెక్నాలజీ) కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్నే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. అందులో పేర్కొన్న దానికన్నా నిజానికి తక్కువగా ఆ రెండు కంపెనీలూ ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. నెలకు 6 కోట్ల డోసులు మాత్రమే అందించగలుగుతున్నాయి.
ఈ లెక్కన దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అది కూడా ఎటువంటి ఎగుమతులూ చేయకపోతేనే. దీనివలన మూడో విడత కోవిడ్ తాకిడికి, బహుశా నాలుగో విడతకు కూడా భారత ప్రజలు దొరికిపోతారు. పైగా అంతర్జాతీయ వ్యాక్సిన్ మార్కెట్‌లో తనకున్న అగ్రస్థానాన్ని పోగొట్టుకుని భారతదేశం ఒక మూలకు నెట్టివేయబడుతుంది. ఇదీ మోడీ ఆత్మనిర్భరత !
తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి చైనా తన ప్రభుత్వ రంగ సంస్థలు సైనోవ్యాక్, సైనోఫార్మ్ లను ప్రోత్సహించి వ్యాక్సిన్ తయారీ విధానం రూపొందించింది. ఆ వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేయడానికి దేశంలో అనేక యూనిట్లకు లైసెన్సులిచ్చింది. తన దేశానికి వెలుపల ఉన్న కంపెనీలకు కూడా లైసెన్సులిచ్చింది.
అదే మోడీ ప్రభుత్వం అయితే, కోవిడ్ ను జయించేశాం అనుకుంది, నిదానంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సాగించవచ్చునని భావించింది. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి గాని, కంపెనీలకు లైసెన్సులివ్వడానికి గాని, వాటికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించడానికి గాని, వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు ఇవ్వడం కాని ఏదీ చేయలేదు. జనవరి 2021లో సీరం ఇన్‌స్టిట్యూట్ కు ఒక కోటి 10 లక్షల డోసులకు మాత్రమే ఆర్డరు ఇచ్చింది. మార్చి నెలాఖరుకు గాని మరో 12 కోట్ల డోసులు రాలేదు. అప్పటికే కరోనా రెండో విడత ఉధృతంగా వ్యాపించింది.
వ్యాక్సిన్ ను వేగంగా ఉత్పత్తి చేసి అందుబాటులోకి తేవడానికి మోడీ ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? రూ.3000 కోట్ల పెట్టుబడితో ఏటా 100 కోట్ల డోసుల అదనపు సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. రూ.6000 కోట్లు పెట్టుబడితో 200 కోట్ల డోసులు, రూ.9000 కోట్ల పెట్టుబడితో 300 కోట్ల డోసులు అదనంగా పెంచుకోవచ్చు. ఒక్క ఏడాది లోపే మన దేశ జనాభాకంతటికీ అవసరమైన వ్యాక్సిన్ ను అందించగలిగి వుండేవాళ్ళం. పైగా అంతర్జాతీ యంగా సరఫరా చేయడంలో ముందుండేవాళ్ళం. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మనను ఏవిధంగా చూస్తోంది ? హామీలు ఇచ్చి, కాంట్రాక్టులు కుదుర్చుకుని, సొమ్ము పుచ్చుకుని, తర్వాత ఆ కాంట్రాక్టుల ప్రకారం సరఫరా చేయకుండా ఎగ్గొట్టే దేశంగా మిగిలిపోయాం. డబ్ల్యుహెచ్‌వో తో కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కోసం 92 దేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఆ 92 దేశాల దృష్టిలో మన స్థానం ఇదే.
రెండు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకయ్యే ఖర్చుతో 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేయవచ్చు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఒక్క ఏడాది ఆపితే చేతిలో మిగిలే రూ.10,000 కోట్లతో 300 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పొందవచ్చు. పోనీ, ఆ రెండూ వాయిదా వేయకపోయినా, బడ్జెట్‌లో కోవిడ్ వ్యాక్సిన్ లకోసం కేటాయించిన రూ.35000 కోట్లలో మూడో వంతు ఖర్చు చేసినా దేశానికి, ప్రపంచానికి కూడా సరిపడా వ్యాక్సిన్ ను అందించి వుండే వాళ్ళం. ఇప్పుడు మన దేశ ప్రజలను మాత్రమే గాక 92 దేశాల ప్రజలను కూడా కరోనా నుంచి రక్షణ కరువైన స్థితి లోకి నెట్టాం. ఇదీ మన మోడీ గారి 'ఆత్మనిర్భర భారత్' ఈ క్లిష్ట సమయంలో మనకిచ్చిన బహుమతి!
(స్వేచ్ఛానుసరణ)
ప్రబీర్ పుర్కాయస్థ











