Oct 31,2023 23:28

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు షరతులతో కూడిన బెయిల్‌ రావడంతో ఉత్కంఠకు తెరపడింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులో జ్యుడీషి యల్‌ రిమాండ్‌లో ఉన్నారు. 52 రోజుల అనంతరం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు కావటంతో ఆయన మంగళవారం విడుదలయ్యారు. దీంతో ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణ సంచా కాల్చి, స్వీట పంచి అనందాన్ని వ్యక్తం చేశారు. బాబు విడుదలవుతున్నారనే సమాచారంతో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సెంట్రల్‌ జైలుకు చేరుకున్నారు. టిడిపి శ్రేణులు రాకుండా పోలీసులు అడుగడుగునా ఆంక్షల చట్రం విధించారు. ఒక దశలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును సిటిఆర్‌ఐ సెంటర్‌ వద్ద అడ్డుకు న్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ వాసు రోడ్డుపై బైఠాయించారు. సాధా రణ ప్రజలకు సైతం ఇబ్బందులు కలిగించేలా పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. సెంట్రల్‌ జైలు రోడ్డుకు వెళ్లేమార్గంలో ఓ వైపు వై.జంక్షన్‌ వద్ద, మరో వైపు లాలా చెరువు అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
సంఘీభావం తెలిపిన వారందరికీ ధన్యవాదాలు
జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తను తప్పు చేయనని, తప్పులను కూడా చేయనివ్వబోనని వ్యాఖ్యానించారు. 52 రోజులు పాటు తనకు మద్దతు తెలిపిన ఘటనను జీవితాతంగ గుర్తుంచుకుంటానని తెలిపారు. జైలు నుంచి విడు దలైన ఆయనకు బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్‌, ఎంఎల్‌ఎ బాలకృష్ణ స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్స్‌ను ఆయన ఆలింగనం చేసుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా విజయవాడకు పయనమయ్యారు.
పోలీసుల తీరుపై విమర్శలు
చంద్రబాబు విడుదల నేపథ్యంలో జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో తొలి రోజుల్లో సెంట్రల్‌ జైలు ప్రాంతంలో144 సెక్షన్‌ ప్రకటించిన విషయం విధితమే. ఆ తర్వాత కూడా కొనసాగింపు చేయడంతో ప్రజలూ ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే నాయకులను సైతం నిర్భంధం గురిచేసేందుకు 144 సెక్షన్‌ను పోలీసులు సాకుగా చూపించారు. మరో వైపు జైలులో ఓ ఖైదీ డెంగీతో మరణించడం, పెన్‌ కెమెరాతో మరో ఖైది లోనికి రావడం వంటి పరిణామాలు పారదర్శకతను ప్రశ్నించాయి. ఉండవల్లి వెళ్తున్న చంద్రబాబును పలకరించేందుకు హైవేపై చేరుకున్న సాధారణ ప్రజలను సైతం అడ్డుకోవటం, కాన్వారుకు సైతం హైవేలో ట్రాఫిక్‌ సమస్యలు సృష్టించడం విమర్శలకు దారి తీసింది.