Dec 06,2020 11:01

         'పక్షుల ధర విషయానికొస్తే-మూడొందల పౌండ్ల ధర పలికిన ఒక ఉష్ట్రపక్షిని చూశాన్నేను ! ' చెప్పాడు.. చచ్చిన జంతువుల చర్మాలతో కృత్రిమ రూపాలను తయారుచేసి అమ్ముకొనే డీలరు (టాక్సీ డెర్మిస్ట్‌) యువకుడిగా ఉన్నప్పటి రోజులలో తాను చేసిన ఓడ ప్రయాణాలను జ్ఞాపకం చేసుకొంటూ.
         'మూడొందల పౌండ్లా? నేన్నమ్మను. ఎందుకంటే నాలుగుపౌండ్లకూ అమ్ముడుబోని ఉష్ట్రపక్షిని నేను చూశాను కాబట్టి' అతనితో విభేదిస్తూ అన్నాను నేను.
         అప్పుడు ఆ డీలరు అన్నాడు. కొంచెం అసహనం ముఖంలో కనబరుస్తూ 'నేనేమీ తమాషాగా మాట్లాడడం లేదు. అప్పటికి సాధారాణమైన ఆ ఐదు ఉష్ట్రపక్షులు సరైన పోషణ లేక కొంచెం నీరసించి ఉన్నాయి. ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారిలో వాటిని ఎగబడి కొందామనే శాల్తీ ఒక్కరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఐదు ఉష్ట్రపక్షుల్ని ఒక తూర్పు దేశపు ధనికుడైన సర్‌ మొహిని పదిషా అధిక ధర చెల్లించి, స్వంతం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా ఎందుకు కొనాలనుకొన్నాడనే అనుమానం రావచ్చు. అందులోనే ఉంది అసలు మతలబు. అసలు సంగతేమంటే, ఆ ఐదు పక్షుల్లో ఒకపక్షి విలువైన వజ్రాన్ని మింగేసింది !  ఆ వజ్రం మొహిని పదిషాకు చెందినది. అతడు ధరించిన షర్ట్‌ కాలర్‌ అతని మెడను పూర్తిగా కప్పేసింది. అతడు ఒక పెద్ద తలపాగా ధరించాడు. ఆ తలపాగాకు ఒక విలువైన వజ్రం అలంకతమై ఉంది. ఆ ఐదు ఉష్ట్రపక్షులలో ఒక పక్షి అతని దగ్గరకొచ్చి, ఆ వజ్రాన్ని లాక్కుని అమాంతంగా మింగేసింది. అతడు జరిగిన పరిణామాన్ని గుర్తించే లోపల, ఆ పక్షి వేగంగా పరుగెత్తికెళ్ళి మిగతా వాటితో కలసిపోయింది. ఆ సంఘటన క్షణాలలో సంభవించింది!' అని వివరించాడు.
          సర్‌ మొహిని పదిషా నానా హంగామా చేశాడు. రచ్చరచ్చగా మార్చేశాడు అక్కడి వాతావరణాన్ని.
          నేను ఆ ఓడలోకి అడుగుపెట్టేటప్పటికి మొహిని పదిషా గగ్గోలుపెడుతూ కనిపించాడు. అక్కడ ఇద్దరు నావికులతో పాటు, ఉష్ట్రపక్షుల యజమానీ ఉన్నాడు. వజ్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తి రభస చేస్తూంటే వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. దురదృష్టమేమంటే ఆ సంఘటన జరిగిన సమయంలో పక్షుల యజమాని ఆ ప్రదేశంలో లేడు. ఆ కారణం వల్ల తన వద్ద ఉన్న ఐదింటిలో వజ్రాన్ని మింగిన పక్షిని గుర్తించలేకపోయాడు. వజ్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఆపకుండా గోల చేస్తూనే ఉన్నాడు.
ఈ విషయం క్షణాలలో ఓడలో ఉన్న వారందరికీ తెలిసిపోయింది. ప్రతిఒక్కరూ ఇదే విషయాన్ని గురించి చర్చించుకొంటున్నారు. పదిషా - ఉబికొచ్చే కన్నీళ్ళనాపుకోలేక కిందకు వెళ్ళిపోయాడు.
           రాత్రి భోజనం సమయంలో అతనొక బల్ల ముందు కూర్చున్నాడు. అతన్ని చూసి కెప్టెన్‌తో పాటు మిగతా ఇద్దరూ వంకరనవ్వు నవ్వారు. అతడు ఆ పక్షులను కొనబోడట! తనకు వజ్రమే కావాలని పట్టుబట్టాడు. దాన్ని తిరిగి పొందే హక్కు తనకే ఉందని గట్టిగా వాదించాడు. లేకుంటే తాను హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ దృష్టికి తీసుకెళ్తానని బెదిరించాడు. పక్షుల యజమాని మాత్రం తన పక్షుల మీద ఔషధాల్నిగానీ మరే ఇతర పద్ధతులనుగానీ ప్రయోగించడానికి ఒప్పుకోలేదు.
           తన పక్షులకు ఎలాంటి హానీ జరగకూడదని, పైగా అతని కొడుకు లండన్‌లో వకీలుగా పనిచేస్తున్నాడని, ఏమైనా జరిగితే తన కొడుకు ద్వారా కోర్టుకు లాగుతానని బెదిరించాడు. అతనికి చెందిన పక్షి వజ్రం మింగినా - వాస్తవముగా అది దాని శరీరంలో ఒక భాగమని, అంతగా కావాలనుకుంటే పరిహారం కోరవచ్చని, ఒకవేళ అలా కోరినా, పదిషా నిర్లక్ష్యం వల్ల వజ్రం పోగొట్టుకున్నాడు కాబట్టి అతడే అందుకు పూర్తిబాధ్యత వహించవలసి ఉంటుందని, అతనికి చెందని పక్షి మీద ఏమాత్రం హక్కు లేదని.. వాదించాడు.
అయితే పదిషా మూర్ఖుడు. న్యాయాన్యాయ విచక్షణ లేనివాడు. ఆ పక్షులన్నింటికీ కడుపు కడిగించి, వజ్రాన్ని బయటికి రప్పించాలని పట్టుబట్టాడు. కానీ ఆ పద్ధతి పక్షుల మీద పనిచేయదని పాపం! అతనికి తెలీదు. పక్షుల యజమాని చెప్పింది సబబుగా ఉందని అక్కడున్న వారందరూ అభిప్రాయపడ్డారు. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఓడలో న్యాయవాదులెవరూ లేరు. చివరకు పదిషా తన పట్టు సడలించాడు. ఏడెన్‌ రేవు దాటాక పక్షుల డీలర్ను కలిసి, ఆ అయిదు పక్షుల్నీ తాను కొంటానని ప్రతిపాదించాడు.
            మరుసటి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో పక్షుల యజమాని, పోటర్‌ అనే యురేషియన్‌ అప్పటికే పక్షులనన్నింటినీ కొనడానికి ఒప్పుకున్నాడు. అందువల్ల తనకు ఆ పక్షుల మీద ఎలాంటి అధికారం లేదు, కాబట్టి పోటర్‌కే అమ్ముతానని పక్షుల యజమాని పదిషాకు చెప్పినట్లుంది. దాంతో రెచ్చిపోయిన పదిషా అతన్ని అందరిముందూ బండబూతులు తిట్టాడు. వాటిని కొంటానని చెప్పిన వ్యక్తికి, ఏడెన్‌లోనే లండన్‌కు టెలిగ్రాం ఇచ్చానని, సూయజ్‌లో వ్యవహారం పరిష్కారమౌతుందనీ పక్షుల యజమాని చెప్పడంతో, మంచి అవకాశం చేజారిపోయిందని నేనూ బాధపడ్డాను.
            'సూయజ్‌లో పోటర్‌ అనే వ్యక్తి పక్షుల యజమానైపోయాడు. పదిషా కన్నీళ్ళపర్యంతమయ్యాడు. ఇంకా ఆశ చంపుకోని పదిషా- తాను రెండువందలా యాభై పౌండ్లిస్తానని, అది పోటర్‌ కొన్న దానికన్నా రెండురెట్లు ఎక్కువ ధర అని పక్షుల యజమానిని ప్రాధేయపడ్డాడు. కానీ పోటరు 'ప్రాణమైనా తీసుకుంటా కానీ ఒక్క పక్షి మీది ఈక కూడా ముట్టుకోనివ్వను' అని గట్టి హెచ్చరిక చేశాడు. ఒక్కొక్క దాన్నే చంపి, వజ్రాన్ని తీసుకుంటాననీ చెప్పాడు. కానీ తరువాత కొంచెం ఆలోచించాడు. పోటర్‌ పందెపుకాడు. దేన్నైనా కొని, లాభాలకు అమ్మే దళారి. కొద్దిసేపటి తరువాత మనసు మార్చుకొన్నాడు. 'వాటిని చంపనని, ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఎనభై పౌండ్ల చొప్పున వేలం పాటలో అమ్ముతాననీ, కానీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒకదాన్ని మాత్రం తన దగ్గరే తన కోసం అట్టే పెట్టుకుంటానని ప్రకటించాడు.'
             అప్పుడు మాతోపాటు ఉన్న వజ్రాల వ్యాపారి- పదిషా తనకు ఆ వజ్రాన్ని చూపించాడని, దాని విలువ సుమారు మూడు నాలుగువేల పౌండ్లు పలుకుతుందని అంచనా వేశాడు. అప్పుడు వేలం పాట ఊపందుకొంది. ఆ పక్షుల యజమాని ఉద్దేశ్యం ప్రకారం ఒక పక్షి తోక ఈకల్లో ఒక ఈక పూర్తి తెలుపు రంగులో ఉందని, అది అజీర్ణంతో బాధపడుతున్నట్లు తాను గుర్తించాననీ నాతో మాటల మధ్యలో అన్నాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పదిషా, సదరు పక్షిని 85 పౌండ్లకు కొంటానన్నాడు.
             నేను ' తొంభై పౌండ్లు ' అని అరిచాను. పాట నాకే దక్కుతుందని ధీమాగా ఉన్నాను. అయితే- అందులోనే వజ్రముందనే విషయం నాకు తెలుసుననుకొని - మిగతా పాటగాళ్ళు పోటీపడ్డారు. చివరకు వజ్రాల వ్యాపారి నూటా డెబ్భై ఐదుకు వేలం దక్కించుకొన్నాడు.
             పదిషా కొంచెం ఆలస్యంగా స్పందించాడు. అతడు 'నూటా ఎనభై' అనే లోపలనే, వజ్రాలవ్యాపారి పరమైంది ఆ పక్షి. అతను ఆ పక్షిని అప్పటికప్పుడే తుపాకితో కాల్చి చంపాడు. అలా చేస్తే మిగతా పక్షుల వేలం పాట మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పోటర్‌ అభ్యంతరం తెలిపాడు. పదిషా మూర్ఖంగా ప్రవర్తించి, కొట్లాటకు దిగాడు. చంపబడిన పక్షిని కోసి చూస్తే అందులో వజ్రం లేదు. నాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే నేను నూటా నలభై దాకా పాడాను మరి !
             'పాట దక్కించుకున్న ఏ ఒక్కరికీ అప్పటికప్పుడు పక్షిని ఒప్పగించను. వేలం పాట ముగిసిన తరువాతే పక్షులన్నిటినీ ఒకేసారి స్వాధీనం చేస్తాను. నా కొడుకు లండన్‌లో వకీలుగా పనిచేస్తున్నాడు. ఏదైనా పక్షిని చంపి కడుపు కోసిన తరువాత, ఒకవేళ అందులో వజ్రం దొరికితే అసలు స్వంతదారునకు ఇవ్వబడదు. ఎందుకంటే అటువంటి సొమ్ము చట్టపరంగా నిధినిక్షేప చట్టం ప్రకారం ప్రభుత్వపరమౌతుంది. కాబట్టి వాటిని ఓడలోనే చంపి వేయడం చట్టసమ్మతం కాదు' అని పోటరు బెదిరించాడు.
             ఆ ప్రకటన ఫలితంగా అక్కడ వేడి వేడి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఓడలో వాటిని చంపడం తెలివితక్కువ పని అని అందరూ అంగీకరించారు. తరువాత వేలం పాట మరుసటి రోజుకు వాయిదా పడింది. అప్పుడొక పెద్దమనిషి చట్టం గురించి మాట్లాడాడు. అటువంటి అమ్మకాలు లాటరీ కిందకొస్తాయని, కాబట్టి అది చట్టవిరుధ్ధమని వాదించి, కెప్టన్‌కు విన్నవించుకున్నాడు. అయితే పోటర్‌ 'నేను వజ్రాలు అమ్మడం లేదు. కేవలం ఉష్ట్రపక్షులను మాత్రమే అమ్ముతున్నానే కానీ ఎవరినీ ఆశపెట్టడం లేదు. నాకు తెలిసినంతవరకూ ఈ పక్షుల్లో, ఏ పక్షి కడుపులోనూ వజ్రం లేదు. నేను నాకోసం అట్టేపెట్టుకొన్న పక్షి కడుపులో ఉంటుందని నా నమ్మకం' అని సమర్థించుకొన్నాడు.
              మరుసటి రోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటికి ఐదు అవకాశాల బదులు, నాలుగే మిగిలుండడం వల్ల. ఆ పక్షులు సరాసరి ఒక్కొక్కటి రెండువందలా ఇరవైఏడు పౌండ్ల ధర పలికాయి. పదిషా ఒక్కదాన్నీ పొందలేకపోయాడు. పైగా అతడు హక్కులు గురించి మాట్లాడి, వాతావరణాన్ని గందరగోళం చేసి పారేశాడు. అందుచేత పోటర్‌ అతని మీద గుర్రుగా ఉన్నాడు. చివరకు మిగిలిన ఆ మూడింటిలో ఒకటి ఒక ఆఫీసరు కొన్నాడు. మరొకటి వజ్రాల వ్యాపారిపరమైంది. మూడోది కొందరు ఇంజినీర్ల బృందం చేజిక్కించుకొంది.
             తరువాత పోటర్‌ 'నేనీ పక్షులను అమ్మి చాలా పొరబాటు చేశాను. అయినా ఫరవాలేదు. కొన్నవారు వాటిని తిరిగి ఇచ్చేస్తే వెయ్యిపౌండ్లిస్తా. వెయ్యిపొండ్లు!... ఇటువంటి విషయాల్లో నేనెప్పుడూ వెధవనౌతుంటాను' అని వాపోయాడు. నిరాశాజనిత రేఖలు అతని మొహంలో కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. అతని వద్ద అట్టేపెట్టుకున్న పక్షి మూలంగా అతని అదృష్టాన్ని వెదుక్కునే ఆఖరి అవకాశం ఇంకా మిగిలుందని నచ్చజెప్పడానికని అతన్ని కలిశాను. కానీ, అతను ఆ పక్షినీ అదే ఓడలో ప్రయాణిస్తున్న ఒక రాజకీయ నాయకునికి అమ్మేశానని, అతని కోసం ప్రత్యేకంగా భద్రపరచి ఉంచానని ఏడుపు మొహంతో చెప్పాడు. నేనింతకు ముందు మొదట్లో చెప్పానే మూడొందల పౌండ్ల ధర పలికిందని, అదే ఆ పక్షి అని చెప్పాడు.
             బ్రిందిసి అనే రేవు పట్టణంలో ఆ మూడు పక్షులను దింపారు. ఆ పెద్దమనిషి కష్టమ్స్‌ నిబంధనల గురించి చెబుతూనే ఉన్నాడు. అతని మాటలను పెడచెవిని పెట్టి పోటర్‌, పదిషా దిగారు. పదిషా వజ్రాన్ని కోల్పోవటంతో దాదాపు పిచ్చివాడైపోయాడు. ఆ మూడు పక్షులను కొన్న వ్యక్తుల చిరునామాలు అడిగాడు. తన చిరునామా వాళ్ళకు చెప్పాడు. ఎవరికైనా ఆ వజ్రం దొరికితే తన అడ్రసుకు పంపించమని చెవుల్లో జోరీగలా పోరుపెట్టాడు. ఆ ముగ్గురు వ్యక్తులకు పదిషా చిరునామా అవసరం లేదు, వారి చిరునామా ఇవ్వలేదు. తాము కొన్న పక్షి కడుపులో వజ్రం దొరికితే దాన్ని తిరిగి ఇచ్చేటంత మూర్ఖులు కాదు. ఆ రేవులో దిగిన వారంతా వివిధ ప్రదేశాలకు రైలుబండ్లలో వెళ్ళిపోయారు. నేను సౌత్‌ ఆప్టన్‌ చేరుకొన్నాను. ఇంజినీర్లు కొన్న పక్షి వంతెన కింద క్రేట్లో ఉంచబడి ఉంది. సన్నని పొడుగైన కాళ్ళతో ఉన్న ఆ జీవి విలువైన వజ్రానికి ప్రతిరూపమా అన్నట్టు క్రేటులో నిలబెట్టబడి ఉంది.
ఈ కథకు ముగింపు తెలియాలంటే మరికొంత సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక వారం రోజులు గడిచాక, షాపింగ్‌ కోసం రీజెంట్‌ వీధిలోకెళ్ళాను. కొంచెం దూరంలో ఇద్దరు వ్యక్తులు ఒకరి చేతుల్లో ఒకరు చెట్టాపట్టాలేసుకుంటూ వెళ్ళడం చూశాను. వాళ్ళ ముఖాలు కొత్తకాంతితో వెలిగిపోతున్నాయి. వారెవరో చెప్పనా? వారు వేరెవరోకాదు పదిషా, పోటర్‌లు.
            ఔను. నేనూ అలాగే ఊహించాను. ఈ ఉదంతంలో సంపన్నుడైన పదిషా వద్ద వజ్రం ఉందనే విషయం మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. అందులో అనుమానపడే ఆవశ్యకత ఎంతమాత్రం లేదు. పదిషా చాలా తెలివైన వ్యాపారవేత్త, సమర్థుడు. అతని పేరును చాలాసార్లు వార్తాపత్రికల్లో చదివాను. కానీ మీరన్నటు ఆ ఉష్ట్రపక్షి అతని వద్ద ఉన్న వజ్రాన్ని నిజంగా మింగిందా? లేదా? అనే అంశం మీద నిస్సందేహంగా, మరొక్కమారు ఆలోచించాల్సిందే మరి !

ఆంగ్ల మూలం : హెచ్‌జి వెల్స్‌
తెలుగు అనువాదం : శొంఠి జయప్రకాష్‌
7989217494