
ఊసేలేని జగనన్న టౌన్ షిప్
- స్థల సేకరణకూ నోచని పథకం
- దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు..
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
ప్రతి మున్సిపాల్టీలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేస్తామని, వాటిలో స్థలాలు కొనాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది మధ్య తరగతి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లు దాటినా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఎమ్మిగనూరులో కాకుండా మిగిలిన ఏడు మున్సిపాల్టీల పరిధిలో ఇంతవరకు స్థల సేకరణే జరగక పోవడంతో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో స్మార్ట్ టౌన్ షిప్‌లో స్థలాల కోసం 13 వేల మందికి పైగా మధ్య తరగతి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 150, 250, 300 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. లే అవుట్లలో రహదారులకు 30 శాతం, ఖాళీ స్థలాలకు 10 శాతం, మౌలిక వసతులకు 5 శాతం, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలకు 1 శాతం చొప్పున స్థలాలు కేటాయిస్తామని గొప్పగా ప్రకటించింది. పాఠశాలలు, 2 ఆసుపత్రులు, నిత్యవసరాలు, బ్యాంకులు, వార్డు సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలు, పిల్లలకు ఆట స్థలాలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. వీటికితోడు వీధి దీపాలు, డ్రైనేజీ, విద్యుత్తు, సౌర దీపాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని, ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో చాలా మంది ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఇంత వరకు స్థలాల సేకరణే జరగలేదు. ఈ పథకం ఉంటుందో లేదో తెలియడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మున్సిపాల్టీల్లో స్మార్ట్ టౌన్ షిప్‌కు సుమారు 500 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల శివారు ప్రాంతాల్లో పలుమార్లు అధికారులు వివిధ రకాల భూములను పరిశీలించారు. కొన్ని భూములను గుర్తించి సంబంధిత రైతులతో సమావేశాలు కూడా నిర్వహించారు. భూములు తీసుకుంటే తమ జీవనం ఎలా అని కొందరు రైతులు ప్రశ్నించారు. కర్నూలు, నంద్యాల వంటి పట్టణాల్లో ఎకరా ధర కనిష్ఠంగా రూ.5 కోట్ల వరకు ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ వంటి పట్టణాల్లో ఎకరం ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు, మిగతా మున్సిపాల్టీలో రూ.50 లక్షల నుంచి రూ. కోటి వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలతో కొనుగోలు చేయడానికి ఏడాదిన్నరగా అధికారులు వివిధ ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. పట్టణాలకు 5 కి.మీల దూరంలో స్థల సేకరణకు చేసిన ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు. ఇదే సమయంలో నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఆదోనిలో అధికారులు గుర్తించిన భూములపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత ఈ పథకం ఊసే లేకుండాపోయింది.