ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రైతులు పండించిన ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడంతోపాటు మంచి ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ-విక్రయాలు (ఈ-ఫామ్ మార్కెటింగ్) రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించింది. తొలి రోజుల్లో జిల్లాలో అన్ని మార్కెట్ కమిటీల్లో మొక్కుబడిగా ప్రారంభించి వదిలేశారు తప్ప ఒక్క రూపాయి విలువైన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోలేదు. రైతుల పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమం మధ్యలో నిలిచి పోయింది. అప్పటి నుంచి విక్రయాల ఊసెత్తడం లేదు. ఈ విధానంలో రైతులు పండించిన వివిధ పంట ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేస్తారు. సొమ్ము చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. రైతులు పండించిన పంటలు దేశంలో ఏ మార్కెట్‌లోనైనా అమ్ముకునే వీలును కల్పిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం 'ఈ-నామ్' ప్రవేశపెట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కొత్తపేటలో మాత్రమే ఈ విక్రయాలు జరుపుతున్నారు. ఈ మార్కెట్లలో రైతులు వారి పంటను ఏ వ్యాపారికైనా అమ్ముకునే అవకాశం కల్పించారు. వ్యాపారులు ఆన్‌లైన్‌లో చూసి వారికి నచ్చిన ఉత్పత్తిని కొనుగోలు చేసుకోవచ్చు. రైతులు సైతం ఎప్పటికప్పుడు ఇతర మార్కెట్లలోని పంట ఉత్పత్తుల ధరల సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.
జిల్లాలో కాకినాడ అర్బన్, కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో 9 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. సామర్లకోట మినహా 16 చోట్ల చెక్ పోస్టులు పని చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పశు గణాంకాలపై లైసెన్స్ వర్తకులు, చెక్ పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు ఈ ఏడాది వసూలు లక్ష్యం రూ.3630.00 లక్షలుగా నిర్ధేశించి ఇప్పటి వరకు రూ.606.39 లక్షలు వసూలు చేసారు. నాలుగు చోట్ల 15055 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల 16 గోదాములున్నాయి.
దళారులకే అమ్మకాలు
జిల్లాలో వరి ఎక్కువగా పండుతుంది. అపరాలు, పత్తి, పచ్చిమిర్చి, కూరగాయలు, బొప్పాయి, వేరుశనగ తదితర పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు. ప్రధానంగా పత్తి పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోవడంతో చివరకు వివిధ ఉత్పత్తులను దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విక్రయాలు గనుక కొన్ని మార్కెట్ కమిటీల్లో జరిగితే రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉండేది. ఈ విధానం ప్రకారం రైతులు దగ్గర సిద్ధంగా ఉన్న పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటారు. సంబంధిత పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులు కూడా ఆన్ లైన్ లో నమోదు కావాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా తమ అవసరాలకు ఉపయోగపడే వ్యవసాయోత్పత్తులను పరిశీలించి వ్యాపారులు ధరను కోట్ చేస్తారు. ఆ ధర రైతుకు నచ్చితే విక్రయించుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా జరగాలి. జిల్లాలో ఆరంభం శూరత్వం మాదిరిగా మొక్కుబడిగా ప్రారంభించారు తప్ప నేటికీ కొనుగోళ్లు చేసే విధంగా అధికారుల ప్రోత్సాహం కనిపించడం లేదనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ-నామ్ ద్వారా కొనుగోళ్లు కూడా ఇతర మార్కెట్ కమిటీలకు విస్తరించలేదు.










