Jun 03,2023 22:46

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా చోట్ల విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సమయపాలన అనేది లేకుండా ఎనీ టైం మందు ఏరులై పారతోంది. అనేక ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని నాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధం హామీ మాట మరిచి భారీగా అమ్మకాలను పెంచారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 382 మద్యం షాపులు, 43 బార్లు, వాక్‌ ఇన్‌ లిక్కర్‌ స్టోర్లు ఉండగా సాధారణ రోజుల్లో దాదాపు రూ.6 కోట్లు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రత్యేక సందర్భాలు, పండుగల రోజుల్లో రోజూవారీ అమ్మకాలు రూ.8 నుంచి 16 కోట్ల దాటుతోంది. అయితే ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున ఐదేళ్లలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా క్షేత్రస్థాయిలో మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. మద్యం బెల్టు షాపులు ఎక్కడ ికక్కడ విచ్చలవిడిగా వెలి శాయి. కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, కోట నందూరు, రౌతుల పూడి, గొల్లప్రోలు, కిర్లంపూడి, కరప, కాజులూరు, తాళ్లరేవు ఇలా పలు మండలాల్లో అనేక గ్రామాల్లో బడి, గుడి అనే తేడా లేకుండా మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో సైతం మద్యం అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న పాన్‌ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం అమ్మకాలు పెరిగాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులో ఉంటుండగా అక్కడ నుంచి కొనుగోలు చేసిన వివిధ బ్రాండ్లను బెల్ట్‌ షాపుల్లో అమ్ముతున్నారు. క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా తీసకుని విక్రయిస్తున్నారు. ఎపిలో దొరకని బ్రాండ్లు సైతం ఆయా బెల్టు షాపుల్లో లభిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు యథేచ్ఛగా రవాణా జరుగుతుండగా బెల్టు షాపుల్లో ఆయా బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో రెగ్యులర్‌ బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదు. అధిక ధరలు వెచ్చించినా మందుబాబులకు కావలసిన బ్రాండ్లు లభించకపోవడంతో బెల్ట్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏ సమయంలో కావాలన్నా అమ్మకాలు సాగిస్తున్నారు.
పట్టని అధికారులు
జిల్లాలోని అనేక గ్రామాల్లో బెల్టుషాపులు బహిరంగంగానే అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత ఎస్‌ఇబి అధికారులు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బంది ఆయా షాపుల నుంచి మామూళ్లను దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్లెదుటే విక్రయాలు జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు తెలిసినా బెల్ట్‌ షాపుల్లో విక్రయాలపై నోరు మెదపడం లేదు. ప్రభుత్వం ఒకపక్క మద్యం నియంత్రణకు హామీ ఇచ్చి మాట మార్చగా వైసిపి నేతలు అందుకు తగ్గట్టుగానే పట్టనట్లు ప్రవర్తిస్తుండడంతో ప్రభుత్వంపై పలువురు మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.