ప్రజాశక్తి-సీలేరు
జీకే వీధి మండలం, సీలేరులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. అనంతరం ఉరుములు చిరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా సీలేరు పరిసర ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. గత రెండు రోజుల నుంచి ఎండ తీవ్రతకి అల్లాడుతున్న ప్రజలు వర్షం కారణంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు, చిత్రకొండ పరిసర గిరిజన గ్రామాల్లోనూ వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతానికి రెండు పాడి గేదెల మృతి
శుక్రవారం ఉరుములు కూడి భారీ వర్షం కారణంగా పిడుగు పడి విద్యుత్ వైర్లు తెగి, విద్యుదాఘాటానికి గురై రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. జీకే వీధి మండలం సీలేరు కన్నబ్బాయి క్యాంపులో నివాసముంటున్న సియంది గోవిందరాజు తన పాడి గేదులను సీలేరు ఐటిఐ వెనుక భాగంలో మేతకు తోలాడు. శుక్రవారం మధ్యాహ్నం పెద్ద పెద్ద ఉరుములతో పడిన పిడుగు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డిస్కం లైన్ 250 ట్రాన్స్‌ఫార్మర్ ఎల్‌టి లైన్ విద్యుత్ తీగలపై పడి వైర్లు తెగిపడ్డాయి. ఆ సమీపంలో మేస్తున్న రెండు పాడి గేదులకు తెగిన విద్యుత్ తీగలకు తాకడంతో ఆ గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అటుగా వస్తున్న ఓ యువకుడు గేదెలు మృత్యువాత గురైనట్లు గుర్తించి పశువులు యజమానికి సమాచారం అందించారు. గోవిందరాజు కుటుంబ సభ్యులతో సంఘటన ప్రదేశాన్ని చేరుకుని మృతి చెందిన రెండు పాడి గేదెలను చూసి బోరున విలపించాడు. రెండింటి విలువ లక్షా 20 వేల రూపాయలు ఉంటుందని బాధిడుతు తెలిపారు. పాలమ్ముకొని తమ కుటుంబం జీవిస్తుందని, గేదెలు చనిపోవడంతో జీవనాధారం పోయిందని, ప్రభుత్వమే తమను ఆర్థికంగా ఆదుకోవాలని గోవిందరాజు కోరారు.
నష్ట పరిహారం చెల్లింపునకు చర్యలు
పిడుగుపాటు విద్యుత్ వైర్లు తెగి, కరెంట్ షాక్‌కు గురై గేదెలు మృతి చెందిన నేపథ్యంలో పశువుల యజమానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని పశు వైద్య అధికారి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ మృత్యువాత గురైన పాడి గేదెలకు పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేసి, నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.










