Apr 22,2023 00:40

అవగాహనా సదస్సులో సిఐ మురళీకృష్ణ



ప్రజాశక్తి - కాకినాడరూరల్‌
ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సర్పవరం రూరల్‌ సి ఐ ఆకుల మురళీకష్ణ సూచించారు. స్థానిక రాయుడు పాలెం బాలకనకదుర్గ ఆలయం వద్ద వైసిపి యువత రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పండుగలకు వేసవిసెలవులకు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో పలు కాలనీలు, బస్తీల్లోని ఇళ్లకు తాళాలు వేస్తారని, దీనిని అసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకోసం దీనిపై కాలనీల్లో గస్తీని పెంచి, రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేస్తున్నామని, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఊరికి వెళ్లే ముందు బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును బ్యాంక్‌ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా డోర్‌ కర్టెన్‌లను వేయాలని, గేటుకు తాళం లోపలివైపు నుండి వేసి జాగ్రత్త వహించాలని చెప్పారు. ఇంట్లో పగలు, రాత్రి చిన్న విద్యుత్‌ బల్బు వెలిగేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లు, పరిసరాలు, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాము ఊరెళతున్నట్టు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవద్దన్నారు. ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ తాళాన్ని అమర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహ నాలకు పకడ్బందీగా లాక్‌ చేయ డంతో పాటు చక్రాలకు చైన్‌లాక్‌ చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో లేదా ఏరియా పెట్రోలింగ్‌ చేసే సిబ్బందికి విధిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. మీ కాల నీలు, బస్తీలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు గానీ, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పెద సత్యం, డికె వరప్రసాద్‌ సత్యనారాయణ, చక్రధర్‌ రావు, లింగం శ్రీనివాస్‌, తలుపులమ్మ, సాయమ్మ సచివాలయం మహిళా పోలీస్‌ ఫారజేనా బేగం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.