Jun 06,2023 23:46

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : ట్రాక్టర్‌ బోల్తాపడి మండంలోని కొండేపాడుకు చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గుంటూరు జిజిహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రే కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తియ్యాయి. మృతులంతా గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందినవారే. ఈ కాలనీలో ఐదు వీదులుండగా మృతి చెందిన వారిలో మొదటి వీధికి చెందిన ఒకరు, రెండో వీధికి చెందిన ఇద్దరు. మూడో వీధికి చెందిన ఇద్దరు, నాలుగో వీధికి చెందిన ఒకరు, ఐదో వీధికి చెందిన ఒకరు చొప్పున ఉన్నారు. మృతదేహాలను ఇళ్లకు తెచ్చిన దగ్గర్నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అన్ని వీధుల్లోనూ రోధనలు మిన్నంటాయి. మృతుల కుటుబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి మృతుల కుటుంబాలను చూసి వారూ కన్నీటి పంర్యంతమయ్యారు. మృతదేహాలను ఎమ్మెల్యే ఎం.సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌ సందర్శించి నివాళులర్పించారు. పలు పార్టీలు, సంఘాల నాయకులు నివాళులర్పించారు.