ప్రజాశక్తి - చిలకలూరిపేట : పెద్దలు పనికి పోవాలన్నా.. పిల్లలు బడికి వెళ్లాలన్నా.. చేతులు తడుముకో వాల్సిందే.. చికటి పడిన తర్వాత రాకపోకలు సాగించాలంటే భయ పడాల్సిందే. ఎవరైనా చనిపోతే అంత్యక్రి యలకు అల్లాడాల్సిందే.. ఇదీ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని టిడ్కో గృహాల్లో నివాసితుల కష్టాలు. ఇళ్లయితే నిర్మించారుగాని రవాణా, భద్రత అంశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు విస్మరించారు. దీంతో ఇక్కడ నివాసం ఉంటున్న వారు యతన పడుతున్నారు.
ఛార్జీల భయం
ఎన్‌ఆర్‌టి సెంటర్ నుండి సింగ్ నగర్ దాటిన తర్వాత సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో 5280 టిడ్కో ఇళ్లను నిర్మించారు. వీటిల్లో సుమారు 3500-4000 కుటుంబాలు ఇళ్లల్లోకి చేరారు. వీరంతా పేద కుటుంబాలు కావడంతో ఏరోజుకారోజు పని చేసుకుంటేనే పూట గడస్తుంది. వీరు పనులకు వెళ్లాలంటే సొంత వాహనాలపై వెళ్లి రావాల్సి ఉంటుంది. వాహనాలు లేనివారు ఆటోల మీద ఆధారపడాల్సిందే. సొంత వాహనాలైతే పెట్రో ధరల భారం.. ఆటోల్లో అయితే ఒక్కోక్కరికి రూ.50- 100కు తగ్గకుండా ఛార్జీ ఉంటోంది. పది మంది కలిసి మాట్లాడుకుంటే ధర తగ్గుతోంది. రాత్రివేళల్లో అయితే ధరలు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. విద్యా ర్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఒక్కొక్కరికి నెలకు రూ.900 వరకూ ఖర్చవుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్‌టిసి రవాణా సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉదయం 7, 9 గంటలకు సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7 గంటలకు ఒకసారి బస్సు నడపాలని స్థానికులు కోరుతున్నారు.
ఒక్క వీధి లైటు లేదు..
టిడ్కో ఇళ్లకు వెళ్లే రహదారి గుంతలమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారడం ఒకెత్తయితే విద్యుత్ సదుపాయం లేకపోవడంతో చీకట్లో ప్రయాణం భయంభయంగా సాగుతోంది. పండరిపు రంలోని వాటర్ ట్యాంకుల నుండి సింగ్ నగర్ వరకు 10 విద్యుత్ స్తంభాలకు లైట్లు ఉన్నా అక్కడి నుండి టిడ్కో ఇళ్ల వరకు ఉన్న 54 విద్యుత్ స్తంభాలకు లైట్లు లేకపోవడంతో అంథకారంగా ఉంటోంది. దీంతో చీకటి పడ్డాక ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు పొలాల మధ్యన కావడంతో పాముల భయం వెంటాడుతోంది. మరోవైపు ఇదే మార్గంలో సింగ్ నగర్ వద్ద మద్యం షాపు ఉండడంతో అక్కడ మద్యం కొనుగోలు చేసిన వారంతా సమీపంలోని పొలాల్లో, రోడ్డు పక్కన కూర్చుని మద్యం సేవిస్తు న్నారు. దీంతో మహిళలు రాకపోకలకు తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతు న్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం సిసి కెమెరాలు, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. టిడ్కో ఇళ్లు, బైపాస్ వద్ద సిసి కెమెరాలు పెట్టడంతోపాటు ఒక పోలీస్ అవుట్ పోస్టునూ ఏర్పాటు చేయాలంటున్నారు.
చావుకొస్తున్న అంత్యక్రియలు
శ్మశాన వాటిక లేకపోవడం టిడ్కో గృహాల్లోని వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ఉంది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు తమ చావుకొస్తున్నాయని ఇక్కడివారా వాపోతున్నారు. ముస్లిములైతే 13 కిలోలమీటర్ల దూరంలో ఉన్న రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఖబరిస్థాన్‌కు మృతదే హాన్ని తీసుకెళ్లాలి. ఇతరులు 9 కిలోమీటర్ల దూరంలోని ఆర్‌టిసి బస్టాండ్ వద్దనున్న శ్మశాన వాటికలకు తీసుకెళ్లాలి. ఇందుకోసం వాహనాలకు రూ.10 వేల వరకూ అవుతోందని ఇక్కడివారు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ గతంలోనే సిపిఎం చేపట్టిన పరిశీలనలో గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. చేస్తామంటున్నారేగాని చర్యలు మాత్రం చేపట్టలేదు. ఈ ప్రాంతంలో సందర్శన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు వచ్చిన పలుమార్లు తాముసైతం సమస్యలను ఏకరువుపెట్టినా పరిష్కారం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.










