ప్రజాశక్తి - దేవనకొండ
ప్రకృతి వైపరీత్యాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ప్రతేడాది నష్టాలకు గురవుతూనే ఉన్నారు. పాలక ప్రభుత్వాలు సైతం రైతులను ఆదుకునే పరిస్థితులు లేవు. గతేడాది మండలంలో అధిక వర్షాలు కురిశాయని పత్తి పంటకు బీమా పరిహారం ఎత్తివేశారు. వేరుశనగకు ఎకరాకు రూ.1000 చొప్పున మాత్రమే వేయడంతో రైతులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అయినా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమయ్యారు. మేఘాలు ఊరిస్తున్నాయి. కానీ చినుకు రాలడం లేదు. వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దేవనకొండ మండలంలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తారు. జూన్ నెల ప్రారంభంలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు పత్తి సాగు చేశారు. విత్తన ప్రారంభంలోనే వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు భూమిలో కుళ్లిపోవడంతో మొలకలు రాలేదు. రైతులు వేల రూపాయల్లో నష్టపోయారు. జూన్ నెల మూడో వారంలో కురిసిన ఓ మోస్తారు వర్షానికి మరోసారి పత్తి విత్తనాలు నాటారు. 20 రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన విత్తనం సైతం గిరకబారి ఉండడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చినుకు కోసం రైతులు ఎదురు చూడడం తప్ప మరో ప్రత్యామ్నాయ అవకాశం ఏమీ లేకపోవడంతో రైతులకు ఈఏడాది కరువు పరిస్థితులు తప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతులకు పాలక ప్రభుత్వాలు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేసి ఉపాధి మార్గాలు చూపించాలని పలు ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కమ్ముకున్న మబ్బులు










