
ప్రజాశక్తి-నెల్లిమర్ల, రేగిడి, తెర్లాం, గజపతినగరం : ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతన్న కడుపు తరుక్కుపోతోంది. నెలరోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లా వ్యాప్తంగా వరిపంట ఎడిపోతోంది. పొట్టదశలో గింజ కట్టే సమయంలో నీరులేక వరిపైరు అల్లాడిపోతోంది. ఈ తరుణంలో వాటిని రక్షించుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఈనెల 22,23 తేదీల్లో తుఫాను వస్తుందని వాతావరణశాఖ సూచనలు చూసి రైతుల ఆశలు చిగురించాయి. తుపాను తీవ్రత ఎలా ఉన్నా కనీసం వర్షం పడితే ఊపిరి పోసినట్లు అవుతుందని రైతులు భావించారు. కానీ తుపాను మన రాష్ట్రానికి, జిల్లాకు లేకపోవడంతో రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. వరుణుడు ఊరించి..ఉసూరుమనిపించడంతో ఆవేదన చెందుతున్నారు.
ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా లేకపోవడంతో వరి రైతు కష్టాలు పడుతున్నాడు. ముఖ్యంగా వరి పంట సాగు చేసే రైతు వర్షం కోసం గత నెలరోజులుగా ఆకాశం వైపు చూస్తున్నాడు. నెల్లిమర్ల మండలంలో 4,895 ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా ప్రస్తుతం వర్ష భావం పరిస్థితుల్లో కొండ వెలగాడ, చంద్రం పేట పరిధిలో 6 ఎకరాల్లో వరిపంట ఎండి పోయినట్లు తెలుస్తోంది. సతివాడ ప్రాంతంలో ఈ నెలాఖరులోగా వఊఊర్షాలు కురవకపోతే పూర్తి స్ధాయిలో వరి పంట ఎండి పోతుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల వరకు సాధారణ వర్షపాతం 1962.64 మిల్లీమీటర్ల కురవాల్సి ఉండగా ఇంతవరకు 1772.36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు లెక్కలు చెబు తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే 190.09 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు కనిపిస్తుంది. ప్రస్తుతం మండలంలో వరిపంట పొట్ట దశలో ఉండడతో ఈ పరిస్థితుల్లో వర్షం అవసరం ఎంతైనా ఉందని ఇప్పడుగాని అనుకున్న రీతిలో గింజ దశలో వర్షాలు కురవకపోతే కనీసం తిండి గింజలు కూడా రాని దుస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రేగిడి మండలంలో వరి పంటను రక్షించు కునేందుకు రైతులు నానా ఆవస్థలు పడుతున్నారు. కొన్ని చెరువులు నీటి నిల్వలు అరకొరగానే ఉన్నాయి. బోరు బావులు, ఇతర నీటి సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఇంజన్లు తోను, చెరువు ప్రాంతాల్లో అయితే వరి పంటలు కాపాడేందుకు బిందెలతో నీరు వేయవలసిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు వరకు పరిస్థితి ఇలానే ఉంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవలసిన పరిస్థితి వస్తుందని ఆ పంటలకు సైతం నీరు కావలసి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజాం మండలంలో 12,435 ఎకరాలు, రేగిడి మండలంలో 13,478 ఎకరాలు, వంగర 9,570 ఎకరాలు, సంతకవిటి మండలంలో 11,264 ఎకరాలలో వరి పంటలు వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులు ఉన్నప్పటికీ శివారు భూములకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెర్లాం మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు లేక వరి చేలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వర్షాధారం మీద ఆధారపడి పెరుమాలి, టెక్కలి వలస, కొత్తవలస, కాలంరాజుపేట, డి గడపవలస ఇలా అనేక గ్రామాల్లో వరినాటు వేశారు. ఇప్పుడు వర్షాలు లేక వరిచేలు మొత్తం ఎండిపోయే పరిస్థితి దాపురించింది. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టినా ప్రయోజనం లేదని అప్పులు పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. పెరుమాలి గ్రామంలో ఎర్ర చెరువు, కొత్తచెరువు కింద ఉన్న ఆయకట్టుదారులు కోరగంజి అశోక్ కుమార్, కే శంకర్రావు, ధర్మారావు, పెద్దింటి వెంకటరమణ పంటలు నష్టపోయినట్లు చెబుతున్నారు. కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
గజపతినగరం మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు లేక వరి చేలు ఎండిపోయాయి. పురిటిపెంట గ్రామం పరిధిలో సుమారు వంద వంద ఎకరాల్లో పొట్టదశలో వరి ఎండిపోయింది. చెరువు లన్నీ అడుగంటి పోవడంతో రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు పెట్టిన పెట్టుబడులు అయినా చేతికి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామానికి బట్టి కాలువ ఉన్నా, అధికారుల నిర్లక్ష్యంతో అది కబ్జాకు గురైంది. దీంతో రైతులకు సాగునీరు అందడం లేదు.